పాల్వంచ, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో గల కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ (కేటీపీఎస్)7వ దశ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తిలో రికార్డు సృష్టించింది. 800 మెగావాట్ల ఉత్పత్తి గల ఒడిశాలోని గారపల్లి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా,6,011. 2768 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసిన కేటీపీఎస్ 7వ దశ ప్లాంట్ సెకండ్ ప్లేస్‌లో నిలిచింది. ఈ సంస్థలో 2020లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాగా మొదటి ఏడాది ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా, ఇప్పుడు రెండో స్థానంలో నిలిచింది. ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఎల్ఎఫ్)లోనూ 85.54 శాతం నమోదు చేయడం విశేషం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో పోల్చుకుంటే ఈ ప్లాంట్ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. ఈ ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత కేవలం ఏడు సార్లు మాత్రమే ట్రిప్ అయినట్లు ఆఫీసర్లు ప్రకటించారు. అత్యధిక సమయం విద్యుత్ ఉత్పత్తి చేసిన ప్లాంట్‌గా కూడా రికార్డు సాధించింది. దీంతో చీఫ్ ఇంజినీర్ పీవీ.రావుకు పలు సంఘాల నాయకులు గ్రీటింగ్స్ చెప్పారు.
5, 6 దశల్లో తగ్గిన విద్యుత్ ఉత్పత్తి
కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ 5, 6వ దశల్లో 2023 – 24 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. 1000 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కేటీపీఎస్ 5, 6 దశల్లో 2022 – 23 ఆర్థిక సంవత్సరంలో 7,1 91. 68 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగగా, 2023 – -2024లో 6,828.334 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి చేసింది. ఈ ప్లాంట్‌లో గతేడాది 82.10 పీఎల్‌ఎఫ్ నమోదు కాగా, ఈ ఏడాది 77.74 శాతం నమోదైంది. బ్యాక్ డౌన్ల కారణంగా విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని ప్లాంట్ చీఫ్ ఇంజినీర్ ప్రభాకర్‌రావు చెప్పారు.