ఫార్ములా ఈ -రేస్‎కు బరాబర్​పైసలిచ్చినం.. అరెస్ట్​ చేస్తరా.. చేస్కోండి: కేటీఆర్

ఫార్ములా ఈ -రేస్‎కు బరాబర్​పైసలిచ్చినం.. అరెస్ట్​ చేస్తరా.. చేస్కోండి: కేటీఆర్
  • అప్పుడు నేనే గవర్నమెంట్..  నేనే పైసలిమ్మన్న.. సంతకం కూడా పెట్టిన
  • హెచ్​ఎండీఏ స్వతంత్ర సంస్థ.. నిధులిచ్చేందుకు కేబినెట్ అనుమతి అక్కర్లే 
  • నన్ను అరెస్ట్​ చేస్తే మహా అయితే రెండు నెలలు జైల్లో పెడ్తరేమో
  • జైల్లోనే యోగా చేసి ట్రిమ్​అయిత.. బయటకొచ్చి పాదయాత్ర చేస్త
  • బీఆర్​ఎస్​ను ఖతం చేయాలని రాజ్​భవన్​లో బీజేపీ, కాంగ్రెస్​ ప్రయత్నాలు
  • కేసు పెడితే గిడితే మేఘా కృష్ణారెడ్డిపై పెట్టాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ–రేస్‎కు బరాబర్​పైసలిచ్చామని, తానే సంతకం పెట్టానని బీఆర్ఎస్​వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​అన్నారు. హైదరాబాద్​బ్రాండ్​ఇమేజ్‎ను పెంచేందుకు నాడు ప్రభుత్వ కార్యక్రమంగా రూ.55 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. ‘‘పైసలు రిలీజ్​ చేయాలని అప్పటి మున్సిపల్​శాఖ కార్యదర్శి అర్వింద్​కుమార్‎కు నేనే చెప్పిన. ఆర్డర్స్​పై సంతకం కూడా పెట్టిన. ఫార్ములా ఈ– రేస్‎కు డబ్బులు రిలీజ్​ చేసిన విషయంలో పూర్తి బాధ్యత నాదే. అర్వింద్​తప్పు లేదు. అప్పుడు నేనే గవర్నమెంట్. ప్రభుత్వంగా నిర్ణయం తీసుకున్న” అని ఆయన పేర్కొన్నారు. 

తనను అరెస్ట్​ చేస్తే చేసుకోవచ్చని, మహా అయితే రెండు మూడు నెలలు జైల్లో పెట్టి రాక్షసానందం పొందుతారేమోనని వ్యాఖ్యానించారు. ‘‘నన్ను ఏం చేసుకుంటారో చేసుకోవచ్చు. దేనికైనా రెడీ.  జైల్లో ఉండి యోగా చేసుకుని మంచిగా ట్రిమ్​అయి వచ్చి పాదయాత్ర చేస్త” అని తెలిపారు. కాంగ్రెస్​, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్​ను ఖతం చేయాలని రాజ్​భవన్‎లో ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. గురువారం తెలంగాణ భవన్‎లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. ఫార్ములా ఈ–రేస్‎కు డబ్బులు రిలీజ్​ చేసిన విషయం హెచ్​ఎండీఏకి తెలియదనడం అర్థరహితమని, హెచ్‎ఎండీఏకు అన్ని విషయాలు తెలుసని, అందుకు సంబంధించి ఉత్తర్వులు కూడా ఉన్నాయని చెప్పారు.

‘‘డబ్బులు ఇవ్వడానికి కేబినెట్​అనుమతి ఉందా.. అని అడుగుతున్నరు. కానీ, హెచ్ఎండీఏ స్వతంత్ర సంస్థ. దానికి సీఎం చైర్మన్‎గా, మున్సిపల్​ శాఖ మంత్రి వైస్​చైర్మన్‎గా ఉంటరు. నాడు వైస్​చైర్మన్‎గా నేను సీఎంతో చర్చించి ఫార్ములా ఈ– రేస్​కు నిధులివ్వాలని నిర్ణయం తీసుకున్న. హైదరాబాద్​బ్రాండ్​ ఇమేజ్ దెబ్బతినకుండా ఉండేందుకే డబ్బులు ఇచ్చినం. ఫార్ములా ఈ– రేస్​తో 49 దేశాల్లో హైదరాబాద్​పేరు తెలిసేలా చేసినం. ఎన్నో పెట్టుబడులను ఆకర్షించేందుకు కృషి చేసినం” అని ఆయన పేర్కొన్నారు. 

ఒలింపిక్స్ ​ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

‘‘హైదరాబాద్​ బ్రాండ్​ ఇమేజ్‎ను దెబ్బతీసినందుకు సీఎం రేవంత్​పైనే కేసు పెట్టాలి. ఏసీబీ ఫుల్​ఫాం ఏంటో రేవంత్‎కు తెలుసా? అవినీతి జరిగిన సందర్బాల్లోనే ఏసీబీని వాడాలి. కానీ, ఇక్కడ అవినీతి ఏముంది..? నాకు ఏం వచ్చింది? నేనేమైనా దాస్కున్ననా? ప్రభుత్వపరంగానే ఖర్చు పెట్టినం తప్ప మాకేం రాలేదు. సిటీలో ఫార్ములా ఈ –రేస్​ను రద్దు చేసిన రేవంత్​ రెడ్డి.. హైదరాబాద్​లో ఒలింపిక్స్​ నిర్వహిస్తామని అంటున్నడు. ఒలింపిక్స్​నిర్వహణకు ఎంత ఖర్చవుతుందో ఆయనకు తెలుసా? దాదాపు రూ.2.9 లక్షల కోట్లు కావాలి. అంటే మన రాష్ట్ర బడ్జెట్​అంత. 

ఒలింపిక్స్​కు రేవంత్​రెడ్డి అంత ఖర్చు పెట్టగలడా?’’ అని ఆయన ప్రశ్నించారు. దేశానికి ఫార్ములా 1 రేస్​ను తీసుకురావాలన్న కల ఈనాటిది కాదని అన్నారు. ‘‘రేవంత్​ రెడ్డి గురువు చంద్రబాబు కూడా 2003లో హైదరాబాద్​లో ఎఫ్1 రేస్​ నిర్వహించే ప్రయత్నం చేసిండు. రేవంత్​ గురువు చేయని పనిని మేం చేసినం” అని కేటీఆర్​పేర్కొన్నారు. ప్రస్తుతం ఈవీల ట్రెండ్​ పెరుగుతుండడంతో భవిష్యత్ తరాలకు వాటిపై మరింత అవగాహన కల్పించేందుకే ఫార్ములా ఈ –రేసింగ్​ను నిర్వహించాలనుకున్నామని చెప్పారు. దీనిని కేవలం ఒక రేస్​లాగానే కాకుండా ఎలక్ట్రిక్​ కార్లను ప్రమోట్​చేసే ఈవెంట్​లాగా కూడా ప్రయత్నించామన్నారు. 

గతంలో చంద్రబాబు హయాంలో ఏర్పాటు చేసిన జీనోమ్ వ్యాలీ ఇప్పుడు వ్యాక్సిన్​తయారీకి హైదరాబాద్​ను రాజధానిగా చేసిందని తెలిపారు. అదే విధంగా ఈ–రేస్​తో హైదరాబాద్​ను ఈవీలకు కేంద్రంగా మార్చాలనుకున్నామన్నారు. ఫార్ములా ఈ –రేస్​తో తాము చేసిన ఖర్చు కేవలం రూ.40 కోట్లేనని, కానీ, హైదరాబాద్​కు వచ్చిన ప్రయోజనం మాత్రం రూ.700 కోట్లు అని నీల్సన్ అనే సంస్థ కూడా చెప్పిందని ఆయన పేర్కొన్నారు. ఫార్ములా ఈ– రేస్​తో పాటు మొబిలిటీ వీక్​ను నిర్వహించామని, వాటితో పలు సంస్థలు భారీ పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. 

ఈ– రేస్​ ద్వారా ఎలక్ట్రిక్​ వెహికల్స్​మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్​ వెహికల్స్​యూనివర్సిటీని ఏర్పాటు చేసి ఆ టెక్నాలజీని ఇక్కడే డెవలప్​ చేయాలన్న లక్ష్యం పెట్టుకున్నామని చెప్పారు. ఫార్ములా ఈ– రేస్, మొబిలిటీ వీక్​కు సంబంధించి నాలుగేండ్లపాటు నిర్వహించేలా త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నామని,  ప్రభుత్వానికి లాభం వచ్చినప్పటికీ గ్రీన్ కో అనే సంస్థ మాత్రం తమకు లాభంరాలేదని పక్కకు తప్పుకుందని ఆయన తెలిపారు. దీంతో ఈ –రేస్​వెళ్లిపోకుండా ఉండేందుకు డబ్బులు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని కేటీఆర్​ చెప్పారు.  

హైదరాబాద్​ను ప్రపంచ పటంలో పెట్టినందుకు మాపై కేసు పెడ్తరా?

సీఎం రేవంత్​రెడ్డి తమపై కక్షసాధింపులకు పాల్పడుతున్నారని కేటీఆర్​ఆరోపించారు. ‘‘మాపై కేసు ఎందుకు పెడ్తవ్​? హైదరాబాద్​ను ప్రపంచపటంలో పెట్టినందుకా? లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చినందుకా? బెంగళూరుకన్నా ఐటీ ఎగుమతులను పెంచినందుకా? ఇక్కడి యువతకు ఉద్యోగాలిచ్చినందుకా? ఎందుకు పెడతావు మాపై కేసు?’’ అని సీఎం రేవంత్​ను ప్రశ్నించారు. ‘‘కేసు పెడితే ఎవరి మీద పెట్టాలి? సుంకిశాల గోడ కూలిన ఘటనలో మేఘా కృష్ణా రెడ్డిపై కేసు పెట్టాలి. ఇప్పటికే డిపార్ట్​మెంట్​కూడా రిపోర్ట్​ ఇచ్చింది. ఆ రిపోర్ట్​ ఆధారంగా కేసు పెట్టాలి.

 నా ఇంటికి ఏసీబీని పంపడం కాదు.. రేవంత్​రెడ్డికి దమ్ముంటే మేఘా కృష్ణా రెడ్డి ఇంటికి ఏసీబీని పంపాలి. కేసు పెడితే కొడంగల్ లిఫ్ట్​స్కీమ్​ గొట్టాల స్కామ్‎లో పెట్టాలి. రాఘవ, మేఘా కంపెనీలకు కేకు ముక్కల్లెక్క ఇచ్చిన పనులకు సంబంధించి కేసు పెట్టాలి” అని వ్యాఖ్యానించారు. తాము బ్రాండ్​ ఇమేజ్​ను క్రియేట్​ చేస్తే.. బ్యాడ్​ ఇమేజ్​ తెస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.  ‘‘విశ్వనగరం ఇమేజ్​ లేకుండా చేస్తే పెట్టుబడులు వస్తాయా?” అని ప్రశ్నించారు.  ‘‘కూలగొట్టుడు, విధ్వంసం చేయడమే కాంగ్రెస్​ వాళ్లకు తెలిసిన పని. వాళ్లకు నిర్మించడం తెలియదు. 

అందుకే సీఎం అయిన వెంటనే ఆ ప్రాజెక్ట్​ రద్దు.. ఈ ప్రాజెక్ట్​ రద్దు అంటూ రేవంత్​ ప్రకటనలు చేస్తున్నడు. నా మీద కోపంతో.. నాకేదో వచ్చిందనుకుని ఏమీ తెలియకుండానే ఫార్ములా ఈ –రేస్​ను రద్దు చేసిండు. దీంతో ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్​బ్రాండ్​ఇమేజ్​ను దెబ్బ తీసిండు. రేవంత్​ రెడ్డి తీసుకున్న దిక్కుమాలిన నిర్ణయంతో ప్రపంచం ముందు హైదరాబాద్​ఇజ్జత్​ పోయింది. మనకు రూ.700 కోట్ల నష్టం మిగిలింది’’ అని కేటీఆర్​ వ్యాఖ్యానించారు.