- సిటీని గుప్పిట్లో పెట్టుకోవాలని మోదీ కుట్ర చేస్తుండు: కేటీఆర్
- బీజేపీ మళ్లీ గెలిస్తే సింగరేణిని అమ్మేస్తడు
- ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఎత్తేస్తామని ఖుల్లా చెప్తున్నడు
- దోస్తులకు రూ.14లక్షల కోట్ల రుణమాఫీ చేసిండు
- అబద్ధమని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
- మే డే వేడుకల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే కుట్రలు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఆ కుట్రలను అడ్డుకోవాలంటే పార్లమెంట్లో బీఆర్ఎస్ ఎంపీలు ఉండాలని అన్నారు.
జూన్ 2 వరకే హైదరాబాద్ ఏపీ, తెలంగాణకు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చి.. కేంద్రం తన చేతుల్లోకి తీసుకునేందుకు ప్లాన్ చేస్తున్నదని చెప్పారు. హైదరాబాద్ యూటీ కాకుండా అడ్డుకోవాలంటే 10 నుంచి 12 మంది బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మే డే వేడుకల్లో పాల్గొన్న కేటీఆర్.. పార్టీ కార్మిక విభాగం బీఆర్ఎస్కేవీ జెండాను ఆవిష్కరించారు. తర్వాత కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తారనే మాటలు వినిపిస్తున్నయ్. ఎందుకంటే.. ఈడ మోదీకి పట్టు దొర్కుతలేదు. జూన్ 2 దాకే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటది. ఆ తర్వాత దీన్ని యూటీగా చేసి ఒక లెఫ్టినెంట్ గవర్నర్‌ను పెట్టి కంట్రోల్ చేద్దామనుకుంటున్నరు. జుట్టును తమ చేతుల్లో పెట్టుకోవాలన్నది వాళ్ల ఆలోచన. అట్లా కావొద్దంటే.. మనది మనకే హైదరాబాద్ ఉండాలంటే.. తెలంగాణ ప్రజల చెమట, రక్తంతో నిర్మించిన సిటీని కాపాడుకోవాలి. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి పార్లమెంట్‌కు పంపాలి’’అని కోరారు.
గోదావరి నీళ్లు తీసుకెళ్లే ప్లాన్ చేస్తున్నరు
గోదావరి నీళ్లు తీసుకెళ్లి.. కింద ఉన్న కావేరీలో కలిపేందుకు మోదీ ప్లాన్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. ‘‘మన అవసరాలు తీర్చకుండానే నీళ్లు పట్టుకుపోతానంటే అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ఉండాలి. రాజ్యాంగాన్ని తీసేస్తామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన రిజర్వేషన్లను ఎత్తేస్తామని కొంత మంది బీజేపీ లీడర్లు ఓపెన్‌గా చెప్తున్నరు. అట్లాంటి దుర్మార్గాన్ని, అరాచకాలను అడ్డుకోవాలంటే గులాబీ జెండా పార్లమెంట్లో ఉండాలి’’అని కేటీఆర్ కోరారు.
మోదీ దోస్తుల ఆదాయం డబుల్ అయింది
కేసీఆర్ గుండెల్లో కార్మికుల కోసం ప్రత్యేక స్థానం ఉంటుందని కేటీఆర్ అన్నారు. కరోనా టైమ్‌లో స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేసి వారిని సొంతూళ్లకు పంపించారని గుర్తు చేశారు. మోదీ మాత్రం మానవత్వం లేకుండా వ్యవహరించారని మండిపడ్డారు. ‘‘అడ్డగోలు పన్నులు, సెస్‌లు వేసి ప్రజల దగ్గర్నుంచి రూ.30లక్షల కోట్లు మోదీ వసూలు చేశాడు. తన దోస్తులైన అంబానీ, అదానీలకు రూ.14లక్షల కోట్ల రుణమాఫీ చేసిండు. నేను చెప్పింది అబద్ధమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్త’’అని కేటీఆర్ సవాల్ విసిరారు.
బీజేపీ గెలిస్తే సింగరేణి ఖతం
కేంద్రంలో మళ్లీ బీజేపీ సర్కార్ వస్తే సింగరేణి ప్రైవేటుపరం అయితదని కేటీఆర్ అన్నారు. సంస్థను తన దోస్తులకు మోదీ అమ్మేస్తారని ఆరోపించారు. ‘‘బీజేపీ మళ్లీ గెలిస్తే సింగరేణి ఉండదు. అడ్డికి పావు షేరుకు అమ్మేస్తడు. మన వేళ్లతో.. మన కండ్లనే పొడుస్తడు’’అని మోదీపై కేటీఆర్ మండిపడ్డారు. సింగరేణి ప్రైవేటుపరం కావొద్దన్నా.. ప్రభుత్వ రంగ సంస్థలు అలాగే ఉండాలన్నా.. బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో ఉండాలని తెలిపారు. ‘‘ఇద్దరు ఎంపీలు ఉన్నప్పుడే ఢిల్లీ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణ తెచ్చిండు. మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామన్న బాధ మీ అందరికీ ఉండొచ్చు. 10 లేదా 12 ఎంపీ సీట్లు ఇయ్యున్రి. కేసీఆర్ మళ్లీ రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి తిరిగొస్తది’’అని అన్నారు.