హైదరాబాద్: బీఆర్‌ఎస్ హయాంలో ఎల్‌ఆర్‌ఎస్ మీద అడ్డగోలుగా మాట్లాడిన కాంగ్రెస్లీడర్లు ఇప్పుడు మాట మార్చారని మాజీ మంత్రి కేటీఆర్ఆరోపించారు. ఇప్పటికే పంటలు ఎండిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఎల్ఆర్ఎస్ను రద్దు చేయాలని డిమాండ్చేస్తూ ఈనెల 6న రాష్ట్రవ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్ర ప్రజల మీద ఆర్థికభారం మోపడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. ఎన్నికల్లో గెలవడానికి అడ్డగోలుగా 420 హామీలిచ్చారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎల్‌ఆర్‌ఎస్ రద్దు చేస్తాం అని భట్టి విక్రమార్క శాసనసభ మీడియా పాయింట్‌లో మాట్లాడిండు. ఎల్‌ఆర్‌ఎస్‌కు 25.44 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మేము నామినల్ ఫీజు పెట్టినం. దీని మీద కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోర్టులో కేసులు వేసిండు. నో ఎల్‌ఆర్‌ఎస్.. నో బీఆర్‌ఎస్ అని ఉత్తమ్ మాట్లాడిండు. ఉచితంగా భూములను క్రమబద్దీకరిస్తాం అని చెప్పిండు.
ప్రజల రక్తమాంసాలను పీలుస్తున్నారని అప్పుడు మమ్మల్ని విమర్శించారు. మరి ఇప్పుడు మీరు ప్రజల రక్త మాంసాలను తాగుతున్నరా కాంగ్రెస్ సర్కార్ చెప్పాలి. ₹20 వేల కోట్ల భారాన్ని ప్రజల మీద మోపుతున్నారు. ఇది సరికాదు. ఒక్కో కుటుంబం మీద ₹లక్ష భారం పడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన విధంగా ఉచితంగా ఎల్ఆర్ఎస్చేయాలి. 25 లక్షల కుటుంబాలకు మార్చి 31లోపు ఎల్‌ఆర్‌ఎస్ కట్టాలని డెడ్‌లైన్ పెట్టారు’ అని కేటీఆర్ మండిపడ్డారు.