- ఇద్దరికి పోలీసులే ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చిన్రు: కేటీఆర్
- పార్టీ ఫిరాయించినోళ్లను డిస్ క్వాలిఫై చేయాలి
- స్పీకర్‌ను కలిసి విజ్ఞప్తి చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇప్పటి వరకు పది మంది కాంగ్రెస్‌లో చేరారని, వారిలో ఇద్దరికి పోలీసుల నుంచి ఫోన్లు వచ్చాయన్నారు. ప్రాణహాని ఉందంటూ పోలీసులే బెదిరించారని ఆరోపించారు. ఇలాంటి వార్నింగ్‌లు రావడంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారని అన్నారు. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ కేటీఆర్ నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేల బృందం మంగళవారం స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి విజ్ఞప్తి చేసింది.
ఈ మేరకు పిటిషన్లు అందజేసింది. తర్వాత ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. ‘‘ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నయ్. మా ఎమ్మెల్యేలను బెదిరించి కాంగ్రెస్‌లో చేర్చుకుంటున్నరు. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలను మూడు నెలల్లో డిస్ క్వాలిఫై చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దాని ప్రకారం కాంగ్రెస్‌లో చేరిన పది మందిని స్పీకర్ డిస్ క్వాలిఫై చేయాలి’’అని అన్నారు.
మీరు చేస్తున్నది అదే కదా?
బీజేపీని వాషింగ్ మిషన్ పార్టీగా విమర్శించిన కాంగ్రెస్.. అదే పని తెలంగాణలో చేస్తున్నదని కేటీఆర్ విమర్శించారు. ‘‘వేరే రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీజేపీ గుంజుకుంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటున్నరు. మరి తెలంగాణలో మీరు చేసేది ఏంటి? దీనిపై ఏ ఒక్క కాంగ్రెస్ లీడర్ కూడా నోరు మెదపడం లేదు. ఎమ్మెల్యేలు పార్టీ మారకపోతే వారి సొంత ఆస్తులను ధ్వంసం చేస్తున్నరు. విజిలెన్స్ దాడులు చేయిస్తామని బెదిరిస్తున్నరు.
భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. బడే భాయ్.. ఛోటే భాయ్‌కు ఏం తేడా లేదు. ఢిల్లీలో బడే భాయ్ నరేంద్ర మోదీ రాజ్యాంగబద్ధ సంస్థలను ఉపయోగించుకున్నట్లుగానే.. ఇక్కడ ఛోటే భాయ్ రేవంత్ ప్రభుత్వ విభాగాలను వాడుకుంటున్నరు. మా వాళ్లను బెదిరిస్తున్నడు’’అని అన్నారు.