
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపణలు
- బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలపై ఎక్స్‌లో స్పందన
హైదరాబాద్, వెలుగు: బీజేపీ నేతలతో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి రహస్య సమావేశాలు పెట్టారని.. ఇది సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలికానీ.. ఈ చీకటి మీటింగ్‌లు పెట్టడమేంటని శుక్రవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
బీజేపీలోని కొందరు సీనియర్ నేతలు సీఎం రేవంత్ రెడ్డితో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్చేసిన ఆరోపణలపై కేటీఆర్ స్పందించారు. ఏ గూడుపుఠాణి చేయడానికి ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారో దమ్ముంటే సీఎం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌లో బీజేపీ కోవర్టులున్నారని మండిపడే రాహుల్ గాంధీకి.. రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకునే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు.
గల్లీలో హోదాను మరచి తిట్లు..
సీఎం రేవంత్ రెడ్డి కాలు గడప దాటదుగానీ.. ఢిల్లీలో మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయని కేటీఆర్ మరో పోస్టులో విమర్శించారు. హోదాను మరిచి గల్లీలో తిడుతున్న ఆయన.. ఢిల్లీలో చిట్చాట్లు చేస్తున్నారన్నారు. నీళ్లు లేక పంటలు ఎండి రైతులు అరిగోస పడుతుంటే.. దానిపై సమీక్ష చేయకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారంటూ మండిపడ్డారు. 39 సార్లు ఢిల్లీ వెళ్లి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుడుతప్ప.. అక్కడి నుంచి సాధించింది ఏం లేదన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా కూడా తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు చేసిన నిరసనలు అభినందనీయమన్నారు.