కేసీఆర్ మీద కోపంతోనే మేడిగడ్డ పర్రె బాగుచేస్తలేరు : కేటీఆర్

కేసీఆర్ మీద కోపంతోనే మేడిగడ్డ పర్రె బాగుచేస్తలేరు : కేటీఆర్
  • మాపై ద్వేషంతో ప్రభుత్వం పంటలు ఎండగొడుతున్నది: కేటీఆర్ 

రాజన్నసిరిసిల్ల, వెలుగు: కేసీఆర్ మీద కోపంతోనే మేడిగడ్డ పర్రెను బాగుచేయకుండా రైతులను ప్రభుత్వం గోస పెడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 48 గంటల్లో నీళ్లు విడుదల చేయకపోతే ఇరిగేషన్ శాఖ మంత్రి చాంబర్‌‌‌‌‌‌‌‌ ఎదుట ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి, సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట మండలాల్లో కేటీఆర్ పర్యటించారు. సిరిసిల్ల మండలం దేవునిగుట్ట తండాలో పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  మేడిగడ్డ ప్రమాదం కుట్రపూరితమని అన్నారు.

కేసీఆర్‌‌‌‌పై ఉన్న కోపం, ద్వేషంతో రేవంత్ సర్కార్ రాష్ట్రంలో పంటలు ఎండగొడుతున్నది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు..కాంగ్రెస్ తెచ్చిన కరువు. కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కాంగ్రెస్ అంటే శనీశ్వరం” అని విమర్శించారు. 

కాళేశ్వరం  నీళ్లతో మల్కపేట రిజర్వాయర్‌‌‌‌ నింపితే దేవునిగుట్ట తండా రైతులు పంటలు సాగుచేసుకునేవారు. మేడిగడ్డకు రిపేర్లు చేసి నీళ్లు ఇవ్వొచ్చు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఎర్రటి ఎండల్లో కూడా అప్పర్ మానేరు, మిడ్ మానేరు ద్వారా  చెరువులు నింపి రైతులను ఆదుకున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నీళ్లు పాతాళంలోకి, నిధులు ఢిల్లీకి, నియామకాలు గాల్లో కలిసిపోయాయి. ప్రస్తుతం మిడ్ మానేరులో 16 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. ఒక్క టీఎంసీ మల్కపేట రిజర్వాయర్‌‌‌‌కు విడుదల చేస్తే.. ఈ ప్రాంత రైతులకు సరిపోతాయి” అని పేర్కొన్నారు. 

ప్రభుత్వ భూమి ఉంటే తప్పేంటి? 

భూకబ్జా కేసులో జైలుకు వెళ్లి ఇటీవల బెయిల్‌‌‌‌పై వచ్చిన తంగళ్లపల్లి మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన రైతు అబ్బాడి రాజిరెడ్డిని కేటీఆర్ ఆదివారం పరామర్శించారు. ‘‘పేరుకు రెడ్డి అయినా పేదవాడైన రాజిరెడ్డికి 30 గుంటల ప్రభుత్వ భూమి ఉంటే తప్పేంటి? గరీబోళ్ల మీద ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తున్నది. సారీ రాజన్న.. నా మీద కోపం నీ మీద తీశారు. బోగస్ కేసుతో అయ్యేదేమీ లేదు.. అధైర్య పడవద్దు. నీ కుటుంబానికి అండగా ఉంటాను” అని భరోసా ఇచ్చారు.