
- భారీ కుంభకోణం ఉంది.. రెండు మూడు రోజుల్లో బయటపెడ్త: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల వెనక భారీ కుంభకోణం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఇందులో బీజేపీ ఎంపీ పాత్ర ఉన్నదని, ఆ వివరాలు రెండు మూడు రోజుల్లో బయటపెడతానని అన్నారు. అది ఒక్క 400 ఎకరాలకే పరిమితం కాలేదని, వేల ఎకరాల కుంభకోణం జరుగుతున్నదని ఆరోపించారు. ఇందులో రేవంత్ రెడ్డి ఒక్కరే లేరని, చాలా మంది భాగస్వాములున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీజేపీకి ఉమ్మడి సీఎం రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఆయన్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ కాపాడుతున్నారని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్ చేశారు.
లిక్కర్ మీద వచ్చే ఆదాయం తప్ప.. మిగతా అన్ని రంగాల్లోనూ ఆదాయం పెంచడంలో రాష్ట్ర సర్కారు విఫలమైందని చెప్పారు. ఇందుకు రాష్ట్ర ఆర్థిక విధానాల్లో లోపాలే కారణమని పేర్కొన్నారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల బతుకు ఢిల్లీ చేతుల్లోనే ఉందని కేటీఆర్‌విమర్శించారు. తెలంగాణను జాతీయ పార్టీలకు అప్పజెప్తే రిమోట్ కంట్రోల్ ఢిల్లీలోనే ఉంటుందని తాము ముందే చెప్పామని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ ధరలు తగ్గుతున్నా.. కేంద్ర ప్రభుత్వం మాత్రం గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచిందని మండిపడ్డారు.
పార్టీ వేడుకలకు 3 వేల ఆర్టీసీ బస్సులు అడిగినం
తెలుగు రాష్ట్రాల్లో 25 ఏండ్లు పూర్తి చేసుకున్న పార్టీలు కేవలం టీడీపీ, బీఆర్ఎస్ పార్టీలేనని కేటీఆర్ అన్నారు. వరంగల్ లోని ఎల్కతుర్తిలో ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలోనే బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహిస్తామని చెప్పారు. సభ అనుమతి కోసం గత నెల 28న జిల్లా పోలీసులకు దరఖాస్తు చేశామన్నారు. 3 వేల బస్సుల కోసం ఆర్టీసీని కోరామని, అందుకు సూత్రప్రాయ అంగీకారం తెలిపారని పేర్కొన్నారు. 27న ఆదివారం కావడం.. స్కూళ్లు, ఆఫీసులకు సెలవు దినం కావడంతో ఎవరికీ పెద్దగా ఇబ్బందులు ఉండవన్నారు. సభ్యత్వ నమోదును డిజిటల్లోనే చేస్తామని, ఆ తర్వాత అధ్యక్ష ఎన్నిక నిర్వహిస్తామని తెలిపారు.