
- సీఎం, మంత్రుల కమీషన్ల కక్కుర్తితోనే
- ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌తో పాటు కొందరు మంత్రులు కమీషన్ల కోసం కక్కుర్తి పడడం వల్లే ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. పనులు జరుగుతున్న ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించిన రెండు రిపోర్టులు ప్రభుత్వం దగ్గర ఉన్నా.. సొంత లాభం కోసం టన్నెల్ పనులను కొనసాగించి ఎనిమిది మందిని బలిచేశారని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. టన్నెల్ పనులు చేస్తున్న జయప్రకాష్ అసోసియేట్స్ లిమిటెడ్ 2020లో అంబర్గ్ టెక్ ఏజీ అనే సంస్థతో టన్నెల్ ప్రాంతంలో ఓ సర్వే చేశారని గుర్తు చేశారు.
టన్నెల్ సీస్మిక్ ప్రెడిక్షన్ సర్వే చేశారని, టన్నెల్‌లోని 13.88 కిలోమీటర్ల నుంచి 13.91 కిలోమీటర్ల మధ్య ఫాల్ట్ జోన్ ఉందని 2022లో స్పష్టంగా చెప్పారని తెలిపారు. 2022లో జీఎస్ఐ మాజీ డైరెక్టర్ జనరల్ మండపల్లి రాజు తో పాటు జయప్రకాశ్ అసోసియేట్స్ భూగర్భ శాస్త్రవేత్త రితురాజ్ దేశ్‌ముఖ్ చేసిన మరో సర్వే రిపోర్ట్ కూడా ప్రభుత్వం దగ్గర ఉందన్నారు. ఆ నివేదికల ప్రకారం టన్నెల్ ఉపరితలాన్ని సరిగా అంచనా వేయకుండానే నిర్మాణాన్ని మొదలుపెట్టారని చెప్పారు. ఆ నివేదికలను దాచిపెట్టిన రేవంత్ సర్కార్.. కార్మికులతో పనులు చేయించిందని ఆరోపించారు.