మునుగోడు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలు దత్తత రాజకీయాలు చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ సహా ప్రచారానికి వెళ్లిన మంత్రులందరూ తలో ఊరును దత్తత తీసుకుంటున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమానికి వెళ్లిన కేటీఆర్...మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. సమస్యలన్నింటికీ తనదే బాధ్యత అని చెప్పుకొచ్చారు.
మంత్రులు మల్లారెడ్డి, ఎర్రబెల్లి తాము ప్రచారం చేస్తున్న గ్రామాల్ని దత్తత తీసుకుంటామని ప్రకటించారు. మంత్రి మల్లారెడ్డి చౌటుప్పల్ మండలం ఆరెగూడెం గ్రామానికి ఇంచార్జీగా ఉన్నారు. ఊరికి సంబంధించిన రోడ్లు, కరెంట్ ఇతర పనులన్నీ చేసి పెడతానని హామీలిచ్చారు. ఇక మంత్రి ఎర్రబెల్లి కూడా సేమ్ దత్తత ప్లానే వేశారు. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే చండూర్ మున్సిపాలిటీ దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చేశారు. అంతేకాదు ఎమ్మెల్సీ రమణతో కలిసి డెవలప్ మెంట్ చేస్తానని ఓటర్లకు చెప్తున్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ అయితే ఓ అడుగు ముందుకేసి...కాబేయే సీఎం కేటీఆరే..మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకున్నారు...మస్త్ అభివృద్ధి జరుగుతుందని ఓటర్లను దువ్వే పనిలో పడ్డారు. కాబోయే సీఎం కేటీఆరే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటే.. మంత్రుల దత్తత వాటా ఏంటనేది మునుగోడు ఓటర్లు ప్రశ్నించుకుంటున్నారు. ఇదంతా ఓట్లు అయ్యేవరకేనన్న విమర్శలొస్తున్నాయి. ఎన్నికలు పూర్తైన తర్వాత ఒక్కరూ కూడా కనిపించరని చెప్పుకుంటున్నారు ఓటర్లు.