అభిమానం, విశ్వాసం, భావజాలం ఎక్కువైతే వాటంత ప్రమాదకరమైనవి మరేవీ ఉండవు. ఆ రంగులద్దాల్లో నిజానిజాల విచక్షణ కనుమరుగైపోతుంది. ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాముడు వచ్చాడు. గుడి లేదు గానీ ఆయన ట్విట్టర్ ముందు అగరబత్తి ముట్టించి, కొబ్బరికాయ కొట్టి కోరిక కోరుకుంటే చాలు తీరిపోతుంది. ఈ మధ్య లబ్దిపొందిన ఓ భక్తుడు ‘మీరు అవతార పురుషుడు, మా రాముడు’ అని ట్విట్ చేస్తే ‘ఒక పార్టీ ఈ మాటను ఒప్పుకోదు’ అని చమత్కరిస్తూ కేటీఆర్ జవాబిచ్చారు. వీరిద్దరినీ ఏమనరాదు. ఎవరి పారవశ్యం వారిది. ప్రశ్నిస్తే పాపిగా శపించబడతారు. అయితే ఈ ట్వీట్ల పాలన ఏమిటో అంతుచిక్కడం లేదు. ఆన్లైన్ అభ్యర్థనల తీరుతెన్నులు తెలియని ప్రజల సంగతేమిటి? రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రజాసంబంధ యంత్రాంగం విధులేమిటి? వారంతా కేటీఆర్ ట్విట్టర్ చిరునామా బోర్డులు ఆఫీసు ముందు తలిగించి చేతులు ముడుచుకుని కూర్చోవలసిందేనా?
కేటీఆర్ ట్విట్టర్‌కే ఎందుకు?
కేటీఆర్ ట్విట్టర్ ఖాతాలో 29 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. కానీ, ఆయనకే ఈ వినతుల ప్రవాహం ఎందుకు? కలెక్టరైనా, కేటీఆరైనా ప్రజలకు చేసే ఆర్థిక సాయం ప్రభుత్వ ఖజానా నుంచే కదా! ఆయనొక్కడే ఇలాంటి సహాయం చేయవచ్చని ప్రభుత్వం కేటీఆర్‌కు ప్రత్యేక అధికారాలు ఏమైనా ఇచ్చిందా? అలాంటిదేమైనా ఉంటే పత్రికా ప్రకటన ఇస్తే అందరికీ ఉపయోగంగా ఉంటుంది. ఇప్పుడు ఆయన ట్విట్టర్ సేవ తెలిసినవాళ్లే సంప్రదించగలుగుతున్నారు. అధికారికంగా తెలియజేస్తే ఈ–సేవా సెంటర్లలోనూ ఈ సదుపాయం కల్పిస్తే ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కేటీఆర్ ట్విట్టర్లో కూడా తన వ్యక్తిగత లేక ప్రభుత్వపరంగా పాల్గొనే రోజువారీ కార్యక్రమాల వివరాలు ఉంటాయి. అయితే ఇప్పుడు అది మెల్లగా ధర్మగంటగా మారిపోయింది. ఆయన తనకు వచ్చిన వినతులకు స్పందించి వీలైన సాయం అందిస్తున్నారు. ఆపత్కాలంలో కోరిన సహాయం అంది సమస్యలు తీరడంతో అవి వార్తలయ్యాయి. ట్విట్టర్లో వైద్యానికి ఆర్థిక సాయం కోరిన వారికి తక్షణ సాయం అందించి కేటీఆర్ఆదుకున్నారని ప్రతికల్లో ప్రముఖంగా రావడంతో టెక్నాలజీతో పరిచయం ఉన్నవారు ఈ బాట పట్టినట్టు అనిపిస్తోంది.
రోజుకు వందకుపైగా ట్విట్లు
‘అందరూ నన్ను స్పంప్రదించవలసిన అవసరం లేదు. ఆయా జిల్లాల కలెక్టర్లకూ ట్విట్టర్ అకౌంట్లు ఉన్నాయి. మీరు తక్షణ సాయం కోసం వారిని అడగవచ్చు’ అని కేటీఆర్ ప్రజలకు దిశానిర్దేశం చేయవచ్చు. దాని వల్ల ఆయనపై ఒత్తిడి తగ్గి, యంత్రాంగం కదిలి బాధితులకు ఎక్కడికక్కడే సాయం అందే అవకాశం ఉంటుంది. కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్‌ను పరిశీలిస్తే రోజుకు సుమారు వంద దాకా ట్విట్లు వస్తున్నాయి. వాటిలో చాలావరకు కేటీఆర్ ఆఫీసుకు పంపి సహకరించండి అని ఉంటోంది. మరికొన్నింటిని ఆయా జిల్లా వైద్యాధికారులకు సంబంధిత కార్యాలయాలకు పంపుతున్నారు. భూతగాదాలు, పట్టాదార్ పాస్‌పుస్తకాల విషయాలు ఆయా జిల్లాల కలెక్టర్లకు తెలుపుతున్నారు. కొన్నింటిని మాత్రం తాను స్వయంగా చొరవ తీసుకుని కేటీఆర్ పరిష్కరిస్తున్నారు. వాటికి లబ్దిదారుల నుంచి కృతజ్ఞతలతో కూడిన సమాధానాలు వస్తున్నాయి. ‘మీ ప్రశంసలు, ధన్యవాదాలు నాకు వద్దు, ఇది నా బాధ్యత, వీలైతే మీరు ఎవరికైనా సాయం చేయండి’ అనే సూచనతో కేటీఆర్ వారికి బదులిస్తుంటారు. అంతా బాగానే ఉంది కానీ, ఈ వ్యవస్థ అంతా ఆయన వద్దే ఎందుకు కేంద్రీకృతమై ఉందనేది అసలు ప్రశ్న. దీనిని వికేంద్రీకరించాలి. తానే సహాయం అందిస్తున్నట్టు వ్యక్తిగత ప్రతిష్ట పెంచుకునే తాపత్రయం దేనికి సంకేతం. ధర్మగంట అనేది రాచరిక పాలనకు ఓ అవశేషం అని ఇప్పటికైనా గుర్తించాలి.
ఎవరికి ట్వీట్ చేసినా పనులు జరగాలె
ఆపత్కాలంలో ప్రజలకు ప్రభుత్వం అందుబాటులో ఉండాలనుకుంటే అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇలా అందరి ట్విట్టర్లు ఇందుకు ఉపయోగపడాలి. వీరిలో ఎవరికి ట్వీట్ చేసినా పనులు జరగాలి. ప్రతి జిల్లాకు కలెక్టర్ నడిపించే యంత్రాంగం ఉంది. ఆయా జిల్లాల ప్రజలు తమ కలెక్టర్‌కు వినతి లేదా ట్విట్ చేసినా ఆయన వారికి సాయం చేయొచ్చు. దీని ద్వారా పనులు చకచకా జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఆయన పట్టించుకోకుంటే స్థానిక ఎమ్మెల్యే, ఇన్చార్జ్ మంత్రికి ట్వీట్ చేయొచ్చు. వీలైతే వారు కదిలివచ్చే అవకాశం ఉంది. వీరిలో ఎవరూ స్పందించకుంటే మహాప్రభూ! అని ఏలిన వారికి మొరపెట్టుకోవచ్చు. దీనిని ప్రొటోకాల్ అంటారని నేను అనుకుంటున్నాను.