ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ అరెస్ట్​ డౌటే: కేంద్రమంత్రి బండి సంజయ్

కరీంనగర్: ఫార్ములా–ఈ రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్ర స్థాయిలో ఫైర్​అయ్యారు. ‘కేసీఆర్ కొడుకేమైనా దేశం కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడా..? ఆయన జైలుకు వెళ్తే బీఆర్ఎస్ నాయకులు గొడవ చేయడానికి..? కేబినెట్ అనుమతి లేకుండా సర్కార్ సొమ్మును అప్పనంగా విడుదల చేయాల్సిన అవసరమేముంది..? పైగా సీఎంను పట్టుకుని లొట్టపీసు సీఎం,  చిట్టినాయుడు, సన్నాసిగాడు అని తిడుతుంటే రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు..?’ అని ప్రశ్నించారు.

కరీంనగర్‎లో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ‘కేటీఆర్ విషయంలో కాంగ్రెస్ చేస్తున్నదంతా లొట్టపీసు వ్యవహారమే. ఎందుకంటే బామ్మర్ది ఫాంహౌజ్ కేసులో డ్రగ్స్‏తో దొరికినా, ఫోన్ ట్యాపింగ్ కేసు, కాళేశ్వరం, ధరణి భూముల వ్యవహారంపైనా హడావుడి చేసి చివరకు లొట్టపీసు వ్యవహారం చేశారు. కేటీఆర్ తిడుతున్నా సీఎం పట్టించుకోకుండా విచారణ పేరుతో అరెస్ట్ చేయకుండా జాప్యం చేస్తున్నారంటే నాకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. 

కేసీఆర్‎తో రేవంత్ రెడ్డి లోపాయికారీ ఒప్పందం చేసుకున్నట్లు డౌట్​వస్తుంది. బీఆర్ఎస్ సర్కార్ చేసిన స్కాంలు తెరపైకి వచ్చినప్పుడల్లా కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టి వస్తున్నరు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ రాజకీయ డ్రామాలను ఎండగట్టడంతోపాటు కేసీఆర్ కుటుంబ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లే విషయంలో బీజేపీ రాజీలేని పోరాటం చేస్తుంది ’ అని తెలిపారు. 

మనసును కలిచి వేసింది

‘తిరుమల ఘటన దురదృష్టకరం. మనసును తీవ్రంగా కలిచి వేసింది. ఘటన కారణాలపై విచారణ జరుగుతోంది. బాధ్యులపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇకపై ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి’ అని కోరారు