- మాట దొర్లింది.. విచారం వ్యక్తం చేస్తున్న: కేటీఆర్
- మహిళా కమిషన్‌కు కేటీఆర్ వివరణ
- మళ్లీ రిపీట్ అయితే చర్యలు తప్పవ్: నేరెళ్ల శారద
- కేటీఆర్ వెంట భారీగా తరలి వచ్చిన బీఆర్ఎస్ మహిళా క్యాడర్
హైదరాబాద్/ సికింద్రాబాద్, వెలుగు : ఆర్టీసీ బస్సులు ఎక్కి బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోండంటూ మహిళలపై తాను చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ విచారం వ్యక్తం చేశారు. ఆ మాటలను తాను యథాలాపంగా అన్నానని, ఇందుకు విచారం వ్యక్తం చేస్తున్నానని శనివారం మహిళా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చుకున్నారు. మహిళలను అవమానిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న కమిషన్, ఈ నెల 16న నోటీసులిస్తూ.. కమిషన్ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది.
ఈ మేరకు శనివారం కమిషన్ ఎదుట హాజరయ్యారు. బీఆర్‌ఎస్ మహిళా నేతలు, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో తోడుగా తీసుకెళ్లారు. కమిషన్ ఎదుట హాజరైన తర్వాత కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. తాను యథాలాపంగా చేసిన వ్యాఖ్యల పట్ల ఇప్పటికే విచారం వ్యక్తం చేశానని, ఇదే విషయాన్ని కమిషన్ ఎదుట తెలిపానని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలు, ఆడపిల్లలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల వివరాలను కమిషన్‌కు అందజేసేందుకు ప్రయత్నించగా.. మరోసారి సమయం తీసుకుని వచ్చి ఆ వివరాలు అందజేయాలని కమిషన్ ఆదేశించిందని తెలిపారు. తనతో పాటు వచ్చిన బీఆర్‌ఎస్ నాయకురాళ్లపై కాంగ్రెస్ మహిళా నేతలు దాడులు చేశారని కేటీఆర్ ఆరోపించారు.
కొందరు సభ్యుల తీరుపై కమిషన్ ఆగ్రహం
బీఆర్‌ఎస్ హయాంలో నియమితులైన మహిళా కమిషన్ సభ్యులు కొందరు, విచారణ ఎదుర్కొనేందుకు వచ్చిన కేటీఆర్‌కు రాఖీలు, దట్టీలు కట్టారు. దీనిపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద ఆగ్రహం వ్యక్తం చేశారు. విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తికి రాఖీలు కట్టి పక్షపాత ధోరణి ప్రదర్శించడం ఏంటని ఆమె ప్రశ్నించారు. మహిళా కమిషన్ గౌరవం, పనితీరుపై ప్రభావం చూపేలా వ్యవహరించినందుకు రాఖీలు కట్టిన సభ్యలకు షోకాజ్ నోటీసులు ఇస్తున్నామని ప్రకటించారు.
కేటీఆర్ క్షమాపణలు అంగీకరిస్తున్నం : కమిషన్
కేటీఆర్ తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాడని కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద తెలిపారు. ఆయన స్థాయి వ్యక్తులు ఇలాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని కేటీఆర్ వివరణ ఇచ్చాడన్నారు. ఆయన క్షమాపణలను అంగీకరిస్తూనే, భవిష్యత్తులో ఇలాంటి కామెంట్లు చేయొద్దని హెచ్చారించామన్నారు. ఒకవేళ మళ్లీ రిపీట్ అయితే చర్యలు తీసుకుంటామన్నారు.
బుద్ధభవన్ వద్ద కేటీఆర్‌కు నిరసన సెగ
సికింద్రాబాద్ బుద్ద భవన్‌లోని రాష్ట్ర మహిళా కమిషన్ ఆఫీసు వద్ద శనివారం ఉద్రిక్తత నెలకొంది. మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై వివరణ ఇచ్చేందుకు కమిషన్‌కు వచ్చిన కేటీఆర్‌ను అక్కడే ఉన్న మహిళా నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీత మరికొంత మంది మహిళలతో కలిసి కమిషన్ ఆఫీసు వద్ద ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో కేటీఆర్ తో కలిసి వచ్చిన బీఆర్ఎస్ మహిళా నేతలు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయగా, ఇరువార్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను అదుపులోకి తీసుకున్నారు.