దాడి వెనుక కేటీఆర్!.. ఆయన ఆదేశాలతోనే కలెక్టర్​పై అటాక్

దాడి వెనుక కేటీఆర్!.. ఆయన ఆదేశాలతోనే కలెక్టర్​పై అటాక్
  • ఆయన ఆదేశాలతోనే కలెక్టర్​పై అటాక్​.. ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర
  • పోలీసుల ముందు ఒప్పుకున్న బీఆర్ఎస్​ నేత పట్నం నరేందర్​రెడ్డి
  • రిమాండ్​ రిపోర్టులో సంచలన విషయాలు

ప్లాన్​లో భాగంగా కేటీఆర్​, నరేందర్, సురేశ్​ మధ్య ఫోన్​ కాల్స్​
ఏం జరిగినా ముఖ్య నేత చూసుకుంటారని నిందితులకు నరేందర్ భరోసా
రైతులను రెచ్చగొట్టి.. కొందరికి 
డబ్బులు ఇచ్చి దాడులు
ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు, -రాజకీయ లబ్ధి పొందేందుకు పన్నాగం

హైదరాబాద్‌‌, వెలుగు: వికారాబాద్‌‌ జిల్లా లగచర్లలో కలెక్టర్​, అధికారులపై జరిగిన దాడి వెనుక బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఆయన ఆదేశాలతోనే  అటాక్​ చేయించినట్లు బీఆర్​ఎస్​ నేత, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్​రెడ్డి ఒప్పుకున్నారు. ఈ కేసులో నరేందర్​రెడ్డిని అరెస్ట్​ చేసిన పోలీసులు.. రిమాండ్​ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలో భాగంగానే కేటీఆర్‌‌, మరికొంత మంది బీఆర్‌‌‌‌ఎస్‌‌ లీడర్లు పక్కా ప్లాన్​ ప్రకారం దాడులకు ఉసిగొల్పారని రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. తన అనుచరుడు భోగమోని సురేశ్​ద్వారా కొందరికి డబ్బులు ఇచ్చి నరేందర్​రెడ్డి దాడులు చేయించారని వెల్లడించారు. దాదాపు 10 పేజీల రిమాండ్‌‌ రిపోర్ట్‌‌లో అనేక విషయాలు ప్రస్తావించారు. 

ఇటు కేటీఆర్​తో.. అటు సురేశ్​తో నరేందర్  ఫోన్లు

ప్లాన్​లో భాగంగా ఒకవైపు కేటీఆర్​తో, మరోవైపు  సురేశ్​తో తాను నిరంతరం ఫోన్‌‌ కాల్స్‌‌ ద్వారా కాంటాక్ట్‌‌లో ఉన్నానని దర్యాప్తులో పట్నం నరేందర్​రెడ్డి వెల్లడించారు. నరేందర్ రెడ్డి ఇచ్చిన కన్‌‌ఫెషన్ స్టేట్‌‌మెంట్‌‌ ఆధారంగా లగచర్ల ఘటన వెనుక కేటీఆర్‌‌‌‌ ప్రమేయం ఉందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేటీఆర్​ పేరును రిమాండ్​ రిపోర్టులో చేర్చారు. నరేందర్‌‌రెడ్డి ఐ ఫోన్​ను సీజ్​ చేశారు. కేటీఆర్‌‌‌‌, పట్నం నరేందర్ రెడ్డి, సురేశ్​మధ్య జరిగిన సంభాషణల కాల్ రికార్డులను సేకరించారు. నిందితుల్లో ఒకరైన విశాల్‌‌తో పాటు గ్రామంలోని కొంతమందిని విచారించగా మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌‌‌‌రెడ్డి ప్రధాన కుట్రదారుగా తేలిందని పోలీసులు స్పష్టం చేశారు. దుగ్యాల మండలంలోని లగచర్ల, చకీంపేట్‌‌, పోలెపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల తండాలకు చెందిన రైతులను కూడా రెచ్చగొట్టారని రిమాండ్ రిపోర్ట్‌‌లో పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు, రాజకీయ ప్రయోజనం కోసమే బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలు దాడుల కుట్ర పన్నారని అందులో ప్రస్తావించారు.  

చంపాలనే ఉద్దేశంతోనే!

అధికారులను చంపాలనే ఉద్దేశంతోనే దాడి జరిగిందని రిమాండ్ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ‘‘సర్వే, ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చే అధికారులను ఎక్కడికక్కడ అడ్డుకోండి. ఏం జరిగినా ఫర్వాలేదు. లేకపోతే భూసేకరణ తర్వాత భూములు దక్కవు. ఎలాంటి ఘటనలు జరిగినా మీకు పార్టీ ముఖ్య లీడర్ సపోర్ట్​గా నిలుస్తడు’’ అని నిందితులకు పట్నం నరేందర్‌‌ రెడ్డి చెప్పినట్లు వెల్లడించారు.  నిందితులకు ఆర్థిక, నైతిక సహాయంతోపాటు అన్ని సౌకర్యాలను నరేందర్​రెడ్డి అందించారని తెలిపారు. వీటికి సంబంధించిన పక్కా ఆధారాలతోనే  నరేందర్ రెడ్డిని బుధవారం ఉదయం హైదరాబాద్‌ ఫిల్మ్ నగర్‌లోని ఆయన ఇంట్లో అదుపులోకి తీసుకున్నట్లు  వెల్లడించారు.