
- మాకు అధికారమే పోయింది..ప్రజాభిమానం పోలె: కేటీఆర్
రాజన్న సిరిసిల్ల, హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో తమకు అధికారం మాత్రమే పోయిందని, ప్రజల్లో అభిమానం అలాగే ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పదేండ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలు మర్చిపోరని, నాలుగేండ్లు గిర్రున తిరుగుతాయని, తర్వాత మళ్లీ బీఆర్‌ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని చెప్పారు. శుక్రవారం సిరిసిల్లలో కౌన్సిలర్ల పదవీ కాలం ముగియనుండటంతో సిరిసిల్ల, వేములవాడ కౌన్సిలర్లకు ఆత్మీయ సత్కార కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొని, మాట్లాడారు.
పదేండ్ల బీఆర్‌ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలు పది కాలాల పాటు యాది చేసుకుంటారని చెప్పారు. మూడోసారి కూడా అధికారంలోకి వస్తామన్న ఉద్దేశంతో కొన్ని పనులను చేయలేకపోయామన్నారు. గతంలో సిరిసిల్లలో అభివృద్ధి పనుల కోసం కేటాయించిన రూ.40 కోట్లను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రిలీజ్ చేయకుండా ఆపేసిందని ఆరోపించారు. తాను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని 142 మున్సిపాలిటీలను సమానంగా అభివృద్ధి చేశానని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రూ.లక్షా 40 వేల కోట్ల అప్పు చేసిందని అన్నారు. కేటీఆర్‌పై కేసు కొట్టివేతహైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ వద్ద అనుమతి లేకుండా మీడియా సమావేశం నిర్వహించారని పేర్కొంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అక్కడి పోలీసులు పెట్టిన కేసును హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు శుక్రవారం జస్టిస్ కె.లక్ష్మణ్ తీర్పు వెలువరించారు. గతేడాది మే 30న చార్మినార్ పరిసరాల్లోని నాలుగు ప్రాంతాల్లో అనుమతి లేకుండా మీడియా సమావేశం నిర్వహించారని ఎమ్మెల్యేలు కేటీఆర్, మాగంటి గోపినాథ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
వారితో పాటు మహమ్మద్ సలాహుద్దీన్, మిర్ ఇనాయత్ అలి బక్రి, గడ్డం ఆశిష్ కుమార్ యాదవ్, పి.శ్రీకాంత్‌లపై కూడా పోలీసులు కేసులు పెట్టారు. దీంతో వారంతా ఈ కేసును హైకోర్టులో సవాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లోగోలో చార్మినార్, కాకతీయ కళా తోరణం తొలగించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తూ మీడియా సమావేశంలో మాట్లాడారని పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని హైకోర్టు తప్పుబడుతూ, కేసును కొట్టి వేసింది.