- ఆయన అరెస్టును మేం అడ్డుకుంటలేం: కిషన్ రెడ్డి
- కేసీఆర్ తరహాలోనే రేవంత్ దోపిడీ
- మూసీ పక్కన 3 నెలలు ఉండేందుకైనా సిద్ధమని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కేంద్రమంత్రులెవ్వరినీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలవలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. కేటీఆర్ ను అరెస్టు చేయకుండా బీజేపీ అడ్డుకుంటున్నదనేది తప్పుడు ప్రచారమని మండిపడ్డారు. గవర్నర్ ఏ ఫైల్ పై సంతకం పెడతున్నారనేది కేంద్రం పర్యవేక్షిస్తుందా? అని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాద్ బేగంపేటలోని టూరిజం హరిత ప్లాజాలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ తరహాలోనే సీఎం రేవంత్ రెడ్డి దోపిడీకి పాల్పడుతున్నారని.. అబద్ధపు, అరాచకపు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ‘‘తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలు చేశామని మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారు. కాంగ్రెస్ పాలనలో మాటలు ప్రజలకు, మూటలు పార్టీకి అన్నట్టుగా పరిస్థితి తయారైంది” అని కామెంట్ చేశారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, పోలీస్ వ్యవస్థను కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒవైసీ కనుసన్నల్లోనే పోలీస్ నియామకాలు, బదిలీలు జరుగుతున్నాయని ఆరోపించారు. చర్చలతో పరిష్కరించాల్సిన సమస్యను కలెక్టర్ పై దాడి జరిగే దాకా తెచ్చారని మండిపడ్డారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారిస్తే, కాంగ్రెస్ మరింత అప్పులపాలు చేస్తున్నదని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ కు ఏకైక ఏటీఏం సెంటర్ గా తెలంగాణ మారిందన్నారు.
పేదల కోసం చావడానికైనా సిద్ధం..
మూసీ పరీవాహక ప్రాంతంలో ఒకరోజు నిద్రించాలని సీఎం రేవంత్ సవాల్ చేశారని, దాన్ని తాను స్వీకరిస్తున్నానని కిషన్ రెడ్డి తెలిపారు. శనివారం మూసీ పక్కనే బస చేయనున్నట్టు చెప్పారు. అవసరమైతే మూడు నెలల పాటు మూసీ పక్కనే ఉండేందుకు తాను సిద్ధమని, దీనికి సీఎం రేవంత్ సిద్ధమా? అని సవాల్ విసిరారు. పేదల ఇండ్లు కూల్చకుండా మూసీ ప్రక్షాళన చేస్తే.. మొదటి తట్ట బీజేపీనే ఎత్తుతుందని చెప్పారు. పేదల ఇండ్లు కూల్చవద్దంటే బుల్డోజర్లతో తొక్కిస్తామని సీఎం రేవంత్ అంటున్నారని మండిపడ్డారు.
ఈ నెల 21 నుంచి లోక్ మంథన్ 22న రాష్ట్రపతి ముర్ము హాజరు
హైదరాబాద్నగరంలోని శిల్పకళా వేదికలో ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు ‘లోక్ మంథన్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. దేశ వారసత్వం, జీవన విధానంపై ప్రతి రెండేండ్లకోసారి లోక్ మంథన్ ను జరుపుకొంటున్నట్టు తెలిపారు. ఈ ఏడాది హైదరాబాద్ లో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. బేగంపేట హరిత ప్లాజాలో శుక్రవారం లోక్ మంథన్ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. లోక్ మంథన్ అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవంగా కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి సైతం అతిథులు రాబోతున్నారని తెలిపారు. 21న స్టాల్స్, ఎగ్జిబిషన్, ప్రతినిధుల రిజిస్ట్రేషన్ నమోదు చేస్తారని, అదే రోజు ఉదయం 10 గంటలకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్టాల్స్, సాంస్కృతిక కార్యక్రమాలను ప్రారంభిస్తారని తెలిపారు. 22న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లోక్ మంథన్ కు హాజరవుతారని చెప్పారు. ప్రజ్ఞా ప్రవాహ్ నేషనల్ కన్వీనర్ నందకుమార్ మాట్లాడుతూ.. 24న జరిగే ముగింపు సమావేశానికి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్ర మంత్రులు హాజరవుతారని ఆయన తెలిపారు.