హైదరాబాద్: ఫార్ములా ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ, ఈడీ ప్రశ్నలు ఒకేలా ఉన్నాయని.. అడిగిన ప్రశ్నలనే తిప్పి తిప్పి అడిగారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో గురువారం (జనవరి 16) ఈడీ కేటీఆర్‌ను దాదాపు 7 గంటల పాటు ప్రశ్నించింది. మనీ లాండరింగ్, ఫెమా నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది. విచారణ అనంతరం ఈడీ ఆఫీస్ బయట కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో అర పైసా అవినీతి లేదు.. లేని అవినీతి కోసం విచారణ పేరుతో కోట్ల రూపాయలు వృధా ఖర్చు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాపై విచారణ కోసం ఖర్చు చేసే డబ్బులతో రైతులను ఆదుకోవచ్చని, సంక్షేమ పథకాలను మరింత సమర్థవంతంగా అమలు చెయొచ్చని హితవు పలికారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈడీ, ఏసీబీ కేసులు ఉన్నాయి.. అందుకే నా పైనా అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసురుతున్నా.. జడ్జి ముందు ఇద్దరం లై డిటెక్టర్ టెస్ట్ చేయించుకుందాం. డేట్, ప్లేస్ రేవంత్ రెడ్డి డిసైడ్ చేయొచ్చు. ఫార్ములా ఈ కేసులో నేను లై డిటైక్టర్ టెస్ట్ చేయించుకుంటా.
ALSO READ | కేసీఆర్ దోచుకున్నడు : మేం పథకాలకు మళ్లించాం : సీఎం రేవంత్ రెడ్డి
రేవంత్ రెడ్డిపై నమోదైన కేసుల విషయంలో ఆయన లై డిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధమా..?’’ అని కేటీఆర్ సవాల్ విసిరారు. దర్యాప్తులో ఈడీ అధికారులకు పూర్తిగా సహకరించానని చెప్పిన కేటీఆర్.. ఎన్నిసార్లు పిలిచినా వస్తా.. ఏం అడిగిన చెబుతానని అన్నారు. కోర్టులు, జడ్జిలపై నమ్మకం ఉందని.. చివరికి న్యాయమే గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. నేను ఏ తప్పు చేయలేదు.. చేయబోను.. తప్పు చేశానని నిరూపిస్తే ఏ శిక్షకు అయిన రెడీ అని ఛాలెంజ్ చేశారు.