రేవంత్ స్థాయికి కేసీఆర్ అక్కర్లేదు..దమ్ముంటే సభను 15 రోజులు నడపాలి: కేటీఆర్​

రేవంత్ స్థాయికి కేసీఆర్ అక్కర్లేదు..దమ్ముంటే సభను 15 రోజులు నడపాలి: కేటీఆర్​
  • కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే 15 రోజులపాటు అసెంబ్లీని నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రాష్ట్రంలో రైతులు, నేత కార్మికులు, ఆటో డ్రైవర్లు, గురుకుల విద్యార్థులు మొదలుకుని అన్ని వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించాలని డిమాండ్​ చేశారు. వాటి తర్వాత రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న స్కాములైన ఫార్ములా ఈ రేస్​పై చర్చించేందుకు తాము కూడా సిద్ధమేనన్నారు. కేసీఆర్ సభకు రావాలని డిమాండ్​చేస్తున్న రేవంత్​ రెడ్డి.. సోషల్ మీడియాలో తమ పార్టీ కార్యకర్తలు పెట్టిన పోస్టులకే తట్టుకోలేకపోతున్నారన్నారు.

రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదన్నారు. మంగళవారం తెలంగాణ భవన్​లో పార్టీ కొడంగల్ నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశమై, మాట్లాడారు. కేబినెట్​ మీటింగ్​ అంటే ప్రజలకు మంచి చేసే అంశాలపై చర్చించాలని, అంతేగానీ, ఎవరిని అరెస్ట్​ చేయాలన్నదానిపై చర్చించడం కాదన్నారు. కొడంగల్ ప్రజల కోసం నిలబడిన తమ నేత నరేందర్ రెడ్డి.. భవిష్యత్​లో రేవంత్​ను తుక్కుతుక్కు చేస్తారన్నారు. భవిష్యత్​లో బీఆర్ఎస్ జైత్రయాత్ర లగచర్ల నుంచే మొదలవుతుందన్నారు. అక్కడి నుంచే రేవంత్ పతనమూ మొదలైందని చెప్పారు. అధికారంలోకి వచ్చేందుకు అడ్డమైన హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే వాటిని తుంగలోకి తొక్కిందని ఆయన ఆరోపించారు.