- పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తం: కేటీఆర్
- త్వరలోనే సుప్రీంలో కేసు వేస్తామని వెల్లడి..ఢిల్లీలో అడ్వకేట్లతో చర్చలు
న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని, పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఒకవైపు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులపై కాంగ్రెస్ పార్టీ సుద్దపూస ముచ్చట్లు చెప్తున్నదని, రాష్ట్రంలో మాత్రం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నదని దుయ్యబట్టారు.
ఢిల్లీ పర్యటనలో ఉన్న కేటీఆర్ సోమవారం సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్లు, న్యాయనిపుణులతో భేటీ అయ్యారు. బీఆర్ఎస్ను వీడిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై వారితో చర్చించారు. అనంతరం కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై న్యాయపోరాటం చేస్తున్నామని, వారిపై అనర్హత వేటు వేసే వరకూ తమ పోరాటం ఆగదని అందులో పేర్కొన్నారు.