వచ్చే ఏడాది పాదయాత్ర చేస్త: కేటీఆర్​

వచ్చే ఏడాది పాదయాత్ర చేస్త: కేటీఆర్​
  • మాపై ద్వేషం పెంచి, ఆశలు రేపడంతోనే ఓడిపోయాం
  • రైతు బంధు డబ్బులు ఢిల్లీకి పోతున్నయి
  • కేంద్రంలో మోదీ.. రాష్ట్రంలో రేవంత్ ఇద్దరూ ఒక్కటే
  • రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామని కామెంట్
  • సూర్యాపేటలో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశం

సూర్యాపేట, వెలుగు: అసూయ, ద్వేషం, ఆశ ఈ మూడు అంశాలే బీఆర్‌ఎస్‌ ఓటమికి కారణమని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఏతుల వెంకట్ రెడ్డి, కోతుల ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటోళ్లు ప్రజలకు ఆశపెట్టి అధికారంలోకి వచ్చారన్నారు. కుటుంబం కోసం రాష్ట్రం తెచ్చుకున్నారంటూ ప్రజల్లో తమపై ద్వేషం పెంచేలా ప్రచారం చేయడంతోనే ఓడిపోయామని కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ర‌‌జోత్సవాల నేప‌‌థ్యంలో సూర్యాపేట‌‌లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తామని, ప్రస్తుతం పాదయాత్రపై కసరత్తు జరుగుతున్నదన్నారు. 

ఉత్తమ్ సూర్యాపేటకు నీళ్లు తేలేదు

బ్యాగు చూడగానే సీఎంకు పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని, 40 సార్లు ఢిల్లీకి పోయిన సీఎం రేవంత్ రెడ్డి.. పోయినప్పుడల్లా రూ.500 కోట్లు పట్టుకుపోతున్నాడని ఆరోపించారు. రుణ మాఫీ, రైతు బంధు డబ్బులు రూ.37 వేల కోట్లు రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ ఖాతాల్లోకి వెళ్తున్నాయని ఆరోపించారు.  కేసీఆర్ లేక‌‌పోతే తెలంగాణ రాష్ట్రం లేదనేది అక్షర స‌‌త్యం అన్నారు.  కేంద్రంలో మోదీ(బడే భాయ్‌‌), రాష్ట్రంలో రేవంత్‌‌రెడ్డి(చోటే బాయ్‌‌) ఇద్దరు ఒక్కటేనని విమర్శించారు. 

రాష్ట్రంలో కాంగ్రెస్‌‌ వైఫల్యాలను బీజేపీ ప్రశ్నించదన్నారు. కేసీఆర్‌‌ ఉన్నప్పుడు వచ్చిన నీళ్లు కాంగ్రెస్‌‌ ఉన్నప్పుడు ఎందుకు రావడం లేదని అడిగితే ఏ ఒక్క కాంగ్రెస్‌‌ నేత సమాధానం చెప్పడం లేదన్నారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా పంటలు ఎండుతున్నాయని, ఇది కాలం తెచ్చిన కరువు కాదు కాంగ్రెస్‌‌ తెచ్చిన కరువే అన్నారు. సూర్యాపేట జిల్లాలో ఆరు ఫీట్ల మనిషి నీళ్ల మంత్రిగా ఉండి సొంత జిల్లాకు నీళ్లు తీసుకురాలేకపోయిండని విమర్శించారు. 

పార్టీ కోసం కష్ట పడ్డ వారికే పెద్ద పీట

ఇక నుంచి కష్టకాలంలో పార్టీని వీడకుండా పని చేసిన నాయకులకే పెద్దపీట వేస్తామని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ఉద్యమం కొత్త కాదని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం తెలంగాణ‌‌కు చారిత్రక అవ‌‌స‌‌రం అన్నారు. అసెంబ్లీ ఎన్నిక‌‌ల్లో ఓడిపోయాం, పార్లమెంట్‌‌లో ఓడిపోయాం, చాలా మంది అన్నారు బీఆర్ఎస్  పని అయిపోయిందని.. పార్టీ మూత‌‌ప‌‌డుత‌‌దని మాట్లాడారు. 

కానీ పార్టీ కార్యకర్తలు ఒక ఫినిక్స్ ప‌‌క్షిలాగా ఆకాశాన్ని అందుకునే విధంగా అద్భుత పోరాట ప‌‌టిమ‌‌తో ముందుకు సాగుతున్నారని చెప్పారు. మే నెల నుంచి సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతామని, గ్రామ స్థాయీ నుంచి జిల్లా స్థాయీ వరకు కమిటీలు వేస్తామని చెప్పారు. పార్టీ ఆఫీసులలో శిక్షణ తరగతులను నిర్వహిస్తామని వెల్లడించారు.