28 సార్లు ఢిల్లీకి పోయి..28 రూపాయలు తేలే: కేటీఆర్

 

  • రేవంత్​ సర్కార్​ను కూకటివేళ్లతో పెకిలిస్తం: కేటీఆర్​
  • లగచర్లలో సీఎం అల్లుడి కోసం భూములు లాక్కుంటున్నరు
  • రేవంత్​ను ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నయ్​
  • మహబూబాబాద్​ బీఆర్​ఎస్​ ధర్నాలో కామెంట్స్​

మహబూబాబాద్​, వెలుగు: రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ను కూకటి వేళ్లతో పెకిలించే వరకు పోరాటాలను కొనసాగిస్తామని బీఆర్ఎస్  వర్కింగ్  ప్రెసిడెంట్​ కేటీఆర్ అన్నారు. రైతులతో పెట్టుకున్న ఎవ్వరు బాగుపడలేదని.. ప్రధాని మోదీ తెచ్చిన నల్లచట్టాలకు వ్యతిరేకంగా రైతులు విరోచితంగా పోరాటం చేశారని.. రాష్ట్రంలోనూ సీఎం రేవంత్ రెడ్డిని రైతులు ఉరికిచ్చి కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘రాష్ట్రంలో పరిపాలన కంటే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను సంతృప్తిపరచడానికే సీఎం సమయం కేటాయిస్తున్నడు. ఈ ఏడాదిలో 28 సార్లు ఢిల్లీకి పొయిచ్చినా కూడా ఆయన రాష్ట్రాభివృద్ధి కోసం  28 రూపాయలు కూడా తీసుకురాలేదు” అని విమర్శించారు. సోమవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్​ఎస్​ మహాధర్నాలో కేటీఆర్​ మాట్లాడారు. లగచర్ల గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి అల్లుడి కంపెనీ కోసం 3 వేల ఎకరాల పేదల భూములను లాక్కోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ‘‘సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ లో గిరిజనులు, దళితులు, పేదలు, బలహీనవర్గాలకు చెందిన భూములను లాక్కుంటున్నరు. రాష్ట్రంలో అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ ప్రజలకు  బీఆర్ఎస్  అండగా నిలుస్తుంది” అని తెలిపారు.  సీఎం రేవంత్ రెడ్డి అదాని కోసం, అల్లుడి కోసం, అన్నల కోసమే పనిచేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు.

వడ్లకు బోనస్​ బోగస్​

‘‘ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ .. గద్దెనెక్కిన తర్వాత ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. రైతుబంధు జాడ లేదు. వరి ధాన్యానికి బోనస్ బోగస్​ అయింది” అని కేటీఆర్​ విమర్శించారు. మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించిన అన్ని చోట్ల కాంగ్రెస్​ పార్టీ ఓడిపోయిందని వ్యాఖ్యానించారు. తాను మీటింగ్​కు వస్తే జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాళ్లతో దాడులు చేస్తామని బెదిరిస్తున్నారని, భయపడబోమని తెలిపారు. వెంటనే ఫార్మాసిటీ ప్రతిపాదనను విరమించుకోవాలని ఆయన డిమాండ్​ చేశారు. ధర్నాలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, జగదీశ్వర్ రెడ్డి, రెడ్యా నాయక్, మాజీ ఎంపీ మాలోత్ కవిత   తదితరులు పాల్గొన్నారు. కాగా, మహబూబాబాద్​ శివారు అమనగల్​ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులను కేటీఆర్​ కలిసి.. బోనస్​ డబ్బులు అందుతున్నాయా? అని ప్రశ్నించారు. కొంత మంది తమకు బోనస్​ డబ్బులు పడుతున్నాయని తెలిపారు. 

ఈడీ దాడులను తప్పించుకోవడానికే ఢిల్లీకి రేవంత్

హైదరాబాద్, వెలుగు: ఈడీ దాడులను తప్పించుకోవడానికే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోతున్నారని బీఆర్‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ ఢిల్లీ టూర్‌‌పై సోమవారం‌‌ ఆయన ట్వీట్ చేశారు. ‘‘పెండ్లికి పోతున్నవో.. పేరంటానికి పోతున్నవో.. సావుకు పోతున్నవో. 28 సార్లు ఢిల్లీకి పోయినా 28 రూపాయలు కూడా తీస్కరాలేదు. రాజ్యాంగబద్ధంగా మినహా ఈ ఏడాదిలో అదనంగా కేంద్రం నుంచి ఒక్క రూపాయి తెచ్చింది లేదు. ఈడీ దాడుల నుంచి తప్పించుకోవడానికి ఫైవ్ స్టార్ హోటల్లో చీకట్లో కాళ్లు పట్టుకున్నదెవరో? ఈడీ చేసిన దాడులు కనీసం బయటకు ప్రకటించకుండా ఎవరి కాళ్లు పట్టుకుని తప్పించుకున్నారో? మీ బడేభాయ్.. చోటే మియాల వ్యవహారం ఎవరికి తెలుసు పిట్టలదొరా. పోరాటం మా తెలంగాణ రక్తంలో ఉంది. మేము నీలా ఎన్నడూ ఢిల్లీ గులాములం కాదు. మా జెండా.. ఎజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ధి’’ అని కేటీఆర్ ట్వీట్ లో పేర్కొన్నారు.