కాంట్రాక్టుల మంత్రి కోసమే సీఎం పని చేస్తున్నరు: కేటీఆర్

కాంట్రాక్టుల మంత్రి కోసమే సీఎం పని చేస్తున్నరు: కేటీఆర్
  • కాంట్రాక్టుల మంత్రి కోసమే సీఎం పని చేస్తున్నరు: కేటీఆర్
  • రాష్ట్రంలోని కాంట్రాక్టులన్నీ ఖమ్మం మంత్రికే ఇస్తున్నరు
  • డిప్యూటీ సీఎం కూడా 30% కమీషన్లు తీసుకుంటున్నట్లు 
  • ఆరోపణలు వస్తున్నయని కామెంట్​

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి కేవలం కాంట్రాక్టుల మంత్రి కోసమే పని చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ అన్నారు. సీఎం నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోని ప్రతి పనికి సంబంధించిన కాంట్రాక్ట్​ ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రికే దక్కుతున్నదని ఆరోపించారు. డిప్యూటీ సీఎం కూడా 30 శాతం కమీషన్లు తీసుకుని పనులు చేస్తున్నారంటూ ఆయన సొంత పార్టీ ఎమ్మెల్యేలే చెబుతున్నారని పేర్కొన్నారు.

మంగళవారం హైదరాబాద్​లో మాజీ మంత్రి పువ్వాడ అజయ్​ ఇంట్లో జరిగిన ఖమ్మం జిల్లా నేతల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. అరచేతిలో స్వర్గం చూపించి కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిందన్నారు. కానీ, ఏ ఒక్క హామీని నెరవేర్చడం లేదని మండిపడ్డారు. ఇక కాంగ్రెస్​సర్కార్ హనీమూన్​ టైమ్ అయిపోయిందని, ప్రజలు ఆ పార్టీ నేతల గల్లా పట్టుకుని కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. ‘‘కాంగ్రెస్​ చేతిలో మోసపోయామని ప్రతి వర్గమూ అనుకుంటున్నది. 

సీఎం రేవంత్​ రెడ్డిని ప్రజలు ఘోరంగా తిడుతున్నారు. ఆ తిట్లకు పౌరుషం ఉన్నోళ్లయితే ఇప్పటికే బకెట్​లో నీళ్లు పోసుకుని దూకి చనిపోయేవారు. కానీ, రేవంత్​రెడ్డి కాబట్టే వాటన్నింటినీ దులుపుకుని వెళ్లిపోతున్నారు” అని విమర్శించారు. సీఎం, మంత్రులకు మధ్య కోఆర్డినేషన్​ లేకపోవడంతో రాష్ట్రం అధోగతి పాలైందన్నారు.  

బీసీలను మోసం చేసింది.. 

బీసీలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని కేటీఆర్ అన్నారు. 42% రిజర్వేషన్, సబ్ ప్లాన్, లక్ష కోట్ల బడ్జెట్ అని చెప్పిన కాంగ్రెస్.. ఇప్పుడు బీసీల జనాభాను ఐదున్నర శాతం తగ్గించిందని మండిపడ్డారు. అన్ని వర్గాలనూ మోసం చేస్తున్న కాంగ్రెస్​ప్రభుత్వానికి బుద్ధి చెప్పే అవకాశం స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో వస్తున్నదన్నారు. పోలీసులను అడ్డంపెట్టుకుని స్థానిక సంస్థలను ఏకగ్రీవం చేసేందుకు ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. 

కేసీఆర్ పుట్టిన రోజున వృక్షార్చన.. 

ఈ నెల 17న కేసీఆర్​పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. చంద్రునికో నూలుపోగులాగా మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్​కుమార్​ వృక్షార్చన కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్​ను కేటీఆర్ మంగళవారం ఆవిష్కరించారు. మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవడమే కేసీఆర్​కు మనమిచ్చే పుట్టినరోజు కానుక అని చెప్పారు.