నియోజకవర్గాల పునర్విభజనతో సౌత్​కు తీవ్ర అన్యాయం: కేటీఆర్​

నియోజకవర్గాల పునర్విభజనతో సౌత్​కు తీవ్ర అన్యాయం: కేటీఆర్​
  • దక్షిణాది రాష్ట్రాలకు శాపంగా మారుతుంది

హైదరాబాద్, వెలుగు: నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్​ కేటీఆర్​అన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాలను పునర్విభజించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం.. తెలంగాణ, ఏపీ, కర్నాటక, కేరళకు శాపంగా మారుతుందని బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయంపై తమిళనాడు సీఎం స్టాలిన్​ ఆందోళనలతో తాను ఏకీభవిస్తున్నానని చెప్పారు. 

‘దేశ సంక్షేమం కోసం జనాభా నియంత్రణను ఒక యజ్ఞంలా భావించి, దాన్ని విజయవంతంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలను కేంద్రంలోని మోదీ ప్రభుత్వం శిక్షించాలని చూస్తున్నదా?’’ అని ప్రశ్నించారు. ఆర్థిక వృద్ధి, మానవ అభివృద్ధి సూచికలు, జనాభా నియంత్రణ వంటి అనేక రంగాల్లో ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు మెరుగైన పనితీరును కనబరిచాయని,  అలాంటి రాష్ట్రాలను శిక్షించి, వెనుకబడిన రాష్ట్రాలను ప్రోత్సహించడం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకమని పేర్కొన్నారు.