ఫార్ములా ఈ రేసులో అణా పైసా అవినీతి జరగలేదు: కేటీఆర్‌‌‌‌

ఫార్ములా ఈ రేసులో అణా పైసా అవినీతి జరగలేదు: కేటీఆర్‌‌‌‌
  • పొన్నం మాటలతోనే స్పష్టమవుతున్నది

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా ఈ రేసులో అణా పైసా అవినీతి జరగలేదని బీఆర్‌‌‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌‌‌ అన్నారు. హెచ్ఎండీఏ చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదని, దానికి స్వతంత్రత ఉందని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. మంత్రి పొన్నం మాటలతో ఈ కేసులో అవినీతి లేదని తేలిందన్నారు. ఈ విషయంపై తప్పుదోవ పట్టిస్తున్నది ముఖ్యమంత్రా.. మంత్రులా లేదంటే కొంతమంది సైకోలా అన్న విషయం తెలియాల్సి ఉందన్నారు.

ఈ కేసులో లంచ్ మోషన్‌‌ పిటిషన్‌‌పై కోర్టు తేలుస్తుందన్నారు. ఓఆర్ఆర్ ఒప్పందంపై సిట్‌‌ ఏర్పాటుపై కేటీఆర్‌‌‌‌ స్పందిస్తూ.. టీవోటీ దేశంలో ఇప్పటికే అమల్లో ఉందని, ఈ విధానంలో ఉన్న ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ నుంచి వచ్చిన డబ్బులను రైతు రుణమాఫీకి ఉపయోగించామని చెప్పారు. ఆర్థిక వనరుల సమీకరణపై అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ పలు సూచనలు చేసిందని, ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ నుంచి డబ్బులు సేకరించవచ్చని సూచించిందన్నారు.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌‌హెచ్‌‌ఏఐ) నుంచి డబ్బులు సేకరిస్తున్న టీవోటీ విధానంలోనే ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ నుంచి డబ్బులను సేకరించామని చెప్పారు. ప్రైవేట్ కంపెనీకి లబ్ధి చేకూర్చారని ఆరోపిస్తున్న సీఎం రేవంత్‌‌ రెడ్డి.. ఆ కంపెనీ లీజును ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. గతంలో ఓఆర్‌‌‌‌ఆర్‌‌‌‌ లీజుల్లో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలపై హెచ్ఎండీఏ పరువు నష్టం దావా వేసిందని గుర్తుచేశారు.

ఆ కేసు అలాగే ఉందన్నారు. ‘‘ఓఆర్ఆర్ వ్యవహారం కుంభకోణమని సీఎం మాట్లాడారు. మరి ఎందుకు లీజ్‌‌ను రద్దు చేయలేదు”అని ప్రశ్నించారు. వెంటనే రద్దుచేసి, సిట్టింగ్ జడ్జి, రిటైర్డ్ జడ్జితో విచారణ చేపట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.