- బుల్డోజర్లకు అడ్డుగా నిలబడ్తం
- ఎవరి కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ
- రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు?
- ముందు హైడ్రా ఆఫీసును కూల్చండి
హైదరాబాద్: హైడ్రా పేరుతో ప్రభుత్వం అమాయక ప్రజల ఇండ్లు కూలుస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్అయ్యారు. బాధితులకు తాము అండగా ఉండి బుల్డోజర్లకు అడ్డుగా నిలబడతామన్నారు. హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగాన్ని మొత్తం పడగొట్టారని.. కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు భయపడుతున్నారని ఆరోపించారు. 100 రోజుల్లో చేస్తామన్న పనులను 300 రోజులు దాటినా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని ఆరోపించారు.
ALSO READ | సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్మీనారాయణకు 14 రోజుల రిమాండ్..
ఇప్పటివరకు ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయలేదన్నారు. తెలంగాణ భవన్ లో కేటీఆర్మీడియాతో మాట్లాడుతూ ‘సీఎం రేవంత్ రెడ్డి మూసీ బాధితుల పాలిట కాలయముడిలా తయారయ్యిండు. ఎవరి కమీషన్ల కోసం మూసీ సుందరీకరణ అంటున్నరు. రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేస్తే.. ఎన్ని ఎకరాలకు నీరు వస్తుంది? కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇండ్లకు పట్టాలు వచ్చాయని ప్రజలు అంటున్నరు. రిజిస్ట్రేషన్ చేసినప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకు చెప్తున్నారని పేదలు అడుగుతున్నారు.
ఇల్లు అనేది ప్రతిఒక్కరికి ఉద్వేగంతో కూడిన అనుబంధం. అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న ఇళ్లను ఎలా కూల్చేస్తారు? పేదల ఇండ్లు కూలుస్తుంటే మేం చూస్తూ ఊరుకోం. కూల్చాల్సి వస్తే మొదట హైడ్రా కమిషన్ కార్యాలయం, బుద్ధభవన్ ను కూల్చాలి. అసలు ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రాధాన్యతలు ఉన్నాయా? రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.1,150 కోట్ల నుంచి రూ.750 కోట్లకు పడిపోయింది’ అని అన్నారు.