కవితకు బెయిల్ వస్తుందని ఆశిస్తున్నం.. కేటీఆర్

కవితకు బెయిల్ వస్తుందని ఆశిస్తున్నం.. కేటీఆర్
  • తెలంగాణ భవన్ లో రక్షా బంధన్  వేడుకల్లో కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: రాఖీ పండుగ నాడు తన సోదరి కవితను బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్  గుర్తుచేసుకున్నారు. ఆమె తనతో లేకపోయినా, తన బ్లెస్సింగ్స్ కవితకు ఉంటాయన్నారు. 155 రోజులుగా కవిత జైల్లో ఉందని, సుప్రీంకోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు.

కవిత పిటిషన్‌‌‌‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో  ఆమెకు బెయిల్  వస్తుందని కేటీఆర్  ఆశాభావం వ్యక్తం చేశారు.  సోమవారం తెలంగాణ భవన్‌‌‌‌లో జరిగిన రక్షా బంధన్  వేడుకకు ఆయన హాజరయ్యారు. పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్  అందరికీ రాఖీ శుభకాంక్షలు తెలిపారు.

ఇందిరా, రాజీవ్ పేర్లు తొలగిస్తం

సెక్రటేరియట్ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే ఊకునేదిలేదని, తాము అధికారంలోకి వచ్చాక ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగిస్తామని బీఆర్‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అంతేకాదు, రాష్ట్రంలో ఇందిరా, రాజీవ్ గాంధీ పేరిట ఉన్న అన్ని స్కీమ్‌‌లు, ప్రాంతాల పేర్లు మారుస్తామని ఆయన ప్రకటించారు. ఎయిర్‌‌‌‌పోర్టుకు రాజీవ్ గాంధీ పేరు తొలగించి, తెలంగాణకు చెందిన వ్యక్తి పేరు పెడుతామని తెలిపారు.

ఈ మేరకు సోమవారం కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. సెక్రటేరియట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సి ఉండగా, అక్కడ రాజీవ్ విగ్రహాన్ని పెట్టడం దుర్మార్గం అని, ఇది తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయడమేనని కేటీఆర్ ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని ఆయన సూచించారు. తెలంగాణ పౌరుషం, వైభవాన్ని చాటేలా సచివాలయం నిర్మించామన్నారు. రేవంత్‌‌రెడ్డి.. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల కూడా వేయలేదని విమర్శించారు. రాహుల్ గాంధీ మెప్పు కావాలంటే తన ఇంట్లో రాజీవ్ విగ్రహం పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు.