- కుట్రతోనే రాఘవ, మేఘా సంస్థలకు పనులు
- బ్లాక్ లిస్టులో పెట్టాల్సిన మేఘాపై సీఎంకు ఎందుకంత ప్రేమ?
- కాంగ్రెస్ ఖజానా నింపుకునేందుకు రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చారని కామెంట్
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్‌రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ‘‘కొడంగల్–నారాయణపేట లిఫ్ట్ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందిన రాఘవ కంపెనీకి, మేఘా సంస్థకు ఇచ్చి క్రోనీ క్యాపిటలిజానికి పాల్పడ్డారు. తద్వారా సీఎం రేవంత్ అధికార దుర్వినియోగం చేశారు. ఎల్అండ్టీ, ఎన్సీసీ లాంటి పెద్ద సంస్థలకు టెండర్లు రాకుండా కావాలనే కుట్ర చేశారు.
రాఘవ, మేఘా సంస్థలు చెరి సమానం అన్నట్టుగా 3.9, 3.95 శాతం కొటేషన్‌తో బిడ్లు వేశాయి. అందులో మతలబేంటి?” అని ప్రశ్నించారు. ఈ మేరకు కేటీఆర్ శనివారం ప్రకటన విడుదల చేశారు. ‘‘సుంకిశాల గోడకూలిన ఘటనలో మేఘా సంస్థను బ్లాక్‌లిస్టులో పెట్టాలని హైదరాబాద్ మెట్రో వాటర్ బోర్డు రిపోర్ట్ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మేఘాపై రేవంత్‌రెడ్డికి అంత ప్రేమ ఎందుకు?” అని ప్రశ్నించారు.
బ్లాక్‌లిస్టులో పెట్టాల్సిన కంపెనీకి రేవంత్తన డ్రీమ్ ప్రాజెక్టును బహుమానంగా ఇవ్వడం వెనుక భారీ అవినీతి ఉందని ఆరోపించారు. ‘‘రూ.4,350 కోట్ల ప్రాజెక్టును మేఘా, రాఘవ సంస్థలకు అప్పగించి, వాళ్ల ద్వారా రూ.వేల కోట్లను కాంగ్రెస్ప్రభుత్వం కొల్లగొడుతున్నది. పార్టీ ఖజానాను నింపుకునేందుకు రాష్ట్రాన్ని ఏటీఎంగా మార్చుకున్నది. మేఘా, రాఘవ కంపెనీల అవినీతి బాగోతాన్ని వదిలే ప్రసక్తే లేదు” అని అన్నారు.
ఇందిరమ్మ రాజ్యమంటే దాడులేనా?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రజాప్రతినిధులపైనా పోలీసులతో దాడులు చేయిస్తున్నారని కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై పోలీసులు అమానుషంగా దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఇలాంటి పిరికిపంద దాడులేనా? అని ప్రశ్నించారు. కౌశిక్‌రెడ్డిపై రేవంత్ కక్ష పెంచుకున్నారని.. గూండాలు, పోలీసులతో దాడులు చేయించి భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల మెప్పు కోసం పోలీసులు ఓవరాక్షన్ చేయొద్దని.. వచ్చేది తమ ప్రభుత్వమేనని, మిత్తితో సహా చెల్లించడం ఖాయమని హెచ్చరించారు.