భూపాల్​రెడ్డా..? కోమటిరెడ్డా..? నల్గొండ ప్రజలే తేల్చుకోవాలి : మంత్రి కేటీఆర్

  •     అభివృద్ధి కొనసాగాలంటే భూపన్నను గెలిపించండి 
  •     తొమ్మిదేళ్లలో సూర్యాపేటలో అద్భుత ప్రగతి
  •     మంత్రి జగదీశ్‌ రెడ్డికి 50 వేల మెజారిటీ ఇవ్వాలని పిలుపు

సూర్యాపేట, నల్గొండ అర్బన్​, వెలుగు : కంచర్ల భూపాల్​ రెడ్డి కావాల్నా..?  కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావాల్నా..? నల్గొండ ప్రజలే తేల్చుకోవాలని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌‌ సూచించారు.  సోమవారం నల్గొండలో ఐటీ హబ్‌, రోడ్ల విస్తరణ, పుట్ పాత్‌లు, సెంట్రల్ లైటింగ్ సిట్టం, రైతు బజార్, అంబేద్కర్ జంక్షన్‌ను ప్రారంభించడంతో పాటు  మర్రిగూడ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్‌‌, కళాభారతి, ఉదయ సముద్రం ట్యాంక్ బండ్ సుందరీకరణ , వార్డుల్లో యూజీడీ పనులు, ఆర్‌‌అండ్‌బీ డివిజన్ ఆఫీస్‌ , వేర్ హౌసింగ్ కమర్షియల్ కాంప్లెక్స్‌, మిర్యాలగూడ నియోజకవర్గానికి మంజూరైన రూ. 311 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశారు.

అంతకుముందు సూర్యాపేటలో ఐటీ హబ్ , సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మున్సిపల్ కాంప్లెక్స్, మహిళా కమ్యూనిటీ హాల్‌ను ఓపెన్ చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ , విలీన గ్రామాల్లో వాటర్ పైప్ లైన్, దోబీ ఘాట్ పనులకు ఫౌండేషన్ వేశారు. అనంతరం సూర్యాపేట ప్రభుత్వ కాలేజీ, ఎన్‌జీ కాలేజీ మైదానంలో జరిగిన ప్రగతి నివేదన సభలో ప్రసగించారు. 

నల్గొండను చూసి చలించిన కేసీఆర్‌‌

నల్గొండలో ఒక ప్రైవేటు ప్రోగ్రామ్‌కు వచ్చిన సీఎం కేసీఆర్ పట్టణ పరిస్థితిని చూసి చలించిపోయారని, ఆయన ఆదేశాల మేరకే నాతో సహా, మంత్రి జగదీశ్‌​ రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్​ రెడ్డి, రాష్ట్ర యంత్రాగం కదిలొచ్చి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే రెండేళ్లలో పట్టణ రూపురేఖలు మార్చామని వెల్లడించారు. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా కోమటిరెడ్డి చేయలేని ఎన్నో అభివృద్ధి పనులు రెండేళ్లలో భూపాల్​ రెడ్డి చేసి చూపించారని, ఇప్పుడున్న అభివృద్ధి కొనసాగాలంటే 70వేల ఓట్ల మెజార్టీ తో గెలిపించాలని పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యే కోరిక మేరకు రోడ్ల అభివృద్ధి కోసం మరో రూ.25కోట్లు శాంక్షన్​ చేస్తామని హామీ ఇచ్చారు.  మంత్రి జగదీశ్ రెడ్డి రాజీలేని కృషితో సూర్యాపేట మెట్రో నగరాన్ని తలపిస్తుందన్నారు. పుల్లారెడ్డి చెరువు ఆధునికరణ, జమ్మిగడ్డ వరకు రోడ్ల విస్తరణ కోసం రూ. 30 కోట్లు మంజూరు చేస్తునట్లు ప్రకటించారు. ఈ సారి జగదీశ్‌రెడ్డిని 50 వేల మెజార్టీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు. 

భూపాల్​రెడ్డిని ఎందుకు వద్దంటున్నరు..? 

భూపాల్​రెడ్డిని ఎమ్మెల్యేగా ఎందుకు వద్దంటున్నరో నల్గొండ ప్రజలు చెప్పాలని మంత్రి జగదీశ్‌ రెడ్డి సవాల్​విసిరారు. జిల్లాలో ఆకలి చావులు, కరువు కాటకాలు మళ్లీ తీసుకొచ్చేందుకు వెంకట్‌ రెడ్డిని కావాలనుకుంటున్నారా?  అని ప్రశ్నించారు.  ఐటీ మంత్రిగా పనిచేసిన వెంకటరెడ్డికి కంప్యూటర్‌ ఎలా ఓపెన్‌ చేయాలో కూడా తెలియదని ఎద్దేవా చేశారు. ఇంజనీరింగ్‌ చదివానని దొంగ సర్టిఫికెట్‌తో మోసం చేశాడని, అలాంటి వాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు.  కాంగ్రెస్​అధికారంలోకి వస్తే తప్ప గడ్డం గీసుకోనని ఒకాయన, మీసాలు పోయినా, నడిచే ఓపిక లేకపోయినా ప్రజలు రమ్ముంటున్నారని ఇంకొకాయక కోసం ఇక్కడ భూపాల్​ రెడ్డిని, అక్కడ నన్ను ఓడించాలని అనుకుంటున్నారా? అని నిలదీశారు. దేశంలో ఐటీ మంత్రి అంటే వినపడే పేరు కేటీఆరేదేనని చెప్పారు.  

ఆయనుకున్న ఆపారమైన మేథస్సుతో ఐటీ, పారిశ్రామిక రంగానికి రాష్ట్రాన్ని స్వర్గధామంగా మార్చారన్నారు.  సూర్యాపేటలో 200 మంది ఉద్యోగులతో ప్రారంభించుకున్న ఐటీ హబ్‌లో  మూడేళ్లలో 5000 మందికి చేరుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, జడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగంధర్, బండ నరేందర్‌రెడ్డి,  ఎమెల్సీ కోటి రెడ్డి,  ఎమ్మెల్యేలు బొల్లం మల్లయ్య యాదవ్, శానం పూడి సైది రెడ్డి

 గాదరి కిషోర్ కుమార్,  రమావత్‌ రవీంద్రకుమార్, ఎన్‌. భాస్కర్‌రావు, నోముల భగత్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కలెక్టర్లు వెంకట్‌రావు, ఆర్‌‌వీ కర్ణన్‌,   కార్పొరేషన్ల చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కన్నీళ్లు పెట్టుకున్న ఎమ్మెల్యే

ఎమ్మెల్యే కంచర్ల భూపాల్​రెడ్డి  గతంలో తనను కోమటిరెడ్డి అవమానించిన సం ఘటనను గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.  2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తనకు టికెట్‌ ఇస్తే ఒక్క చెయ్యోడని అవమానించారని గుర్తు చేశారు. కోమటి రెడ్డికి రెండు చేతులు ఉన్నా జనాలు  ఒక్క చెయ్యోన్నే గెలిపించారన్నారు. ఈ సారి  లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. సింగిల్​ హ్యాండ్​తో ఏం చేశానో చూపించేందుకే క్లాక్​ టవర్​ జంక్షన్‌లో నా చెయ్యి చిహ్నాన్ని ఏర్పాటు చేయించానని స్పష్టం చేశారు. ఆ చేతిలోంచి ఆగకుండా నీళ్లు వస్తాయని,  నీళ్ల మాదిరిగానే కేసీఆర్, కేటీఆర్‌ నల్గొండ అభివృద్ధికి నిధులు సాంక్షన్‌ చేశారని వివరించారు.