బీజేపీ వందల కోట్లు కుమ్మరించింది: కేటీఆర్

మాకు ఇంకా మెజార్టీ రావాల్సి ఉండే
బీజేపీ వందల కోట్లు కుమ్మరించడంతో తగ్గింది : కేటీఆర్ 
మోడీ, షాకు చెంపపెట్టు లాంటి తీర్పు
బీఆర్ఎస్ కు గుర్తింపు లభిస్తే గుజరాత్ లో పోటీపై ఆలోచిస్తామని వెల్లడి


హైదరాబాద్‌‌, వెలుగు: మునుగోడు ప్రజలు తెలంగాణ ఆత్మగౌరవానికి పట్టం కట్టారని.. మోడీ, అమిత్‌‌ షా అహంకారంతో వాళ్లపై ఉప ఎన్నికను రుద్దితే వాళ్లకు చెంపపెట్టు లాంటి తీర్పు ఇచ్చారని టీఆర్‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌, మంత్రి కేటీఆర్‌‌ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ఎన్నికలో గెలిపించిన మునుగోడు ప్రజలకు, పార్టీ గెలుపు కోసం పని చేసిన మంత్రులు, ఇతర లీడర్లు, సహకరించిన సీపీఎం, సీపీఐ నాయకులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చిన బీజేపీ సర్కారు.. అదే క్రూరమైన క్రీడకు తెలంగాణలోనూ తెరతీసింది. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టడం సహా ఎన్నో కుట్రలు చేసింది. రాజకీయాల్లో హత్యలు ఉండవని, ఆత్మహత్యలే ఉంటాయన్న దాన్ని మునుగోడు ఉప ఎన్నిక నిరూపించింది. మా అభ్యర్థికి ఇంకా మెజార్టీ రావాల్సి ఉండే. కానీ ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దలు వందల కోట్లు కుమ్మరించి మెజార్టీ తగ్గించారు” అని ఆరోపించారు. ఎలక్షన్‌‌ కమిషన్‌‌ సహా సెంట్రల్‌‌ టీమ్‌‌లతో బీజేపీ మునుగోడుపై దండయాత్రకు వచ్చిందన్నారు. ‘‘గత ఎన్నికల్లో రాజగోపాల్‌‌ రెడ్డి 23 వేల ఓట్ల మెజార్టీతో గెలిస్తే, ఇప్పుడు 10 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు. మొత్తంగా ఆయన 33 వేల ఓట్లను కోల్పోతే, మా పార్టీకి అదనంగా 20 వేలకు పైగా ఓట్లు వచ్చాయి” అని తెలిపారు. 

గెలుపు కోసం చిల్లర వేషాలు వేసిన్రు... 

ఎన్నికలకు ముందు ఈటల రాజేందర్‌‌ తనపై దాడి చేసినట్టు ప్రెస్ మీట్ పెట్టి సానుభూతి పొందే డ్రామాలు చేశారని, బండి సంజయ్ మునుగోడులో ఏవో అక్రమాలు జరుగుతున్నాయంటూ అర్ధరాత్రి డ్రామాలు చేశారని కేటీఆర్ మండిపడ్డారు. ‘‘ఎన్నికల్లో గెలిచేందుకు ఆడని నాటకం, వెయ్యని వేషం లేదు. ఎన్ని చిల్లర వేషాలు వేసినా మునుగోడు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. పైన ఉన్నోడు ఫేకుడు.. ఇక్కడ జోకుడు.. తప్ప ఆ పార్టీ నేతలు చేసిందేమీ లేదు” అని విమర్శించారు. దమ్ముంటే ప్రజాస్వామ్య బద్ధంగా కొట్లాడాలని సవాల్‌‌ విసిరారు. కేంద్రం ఆధ్వర్యంలో పనిచేసే ఈసీపైనా, తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన ఎన్జీవోలపైనా ఆరోపణలు చేశారని ఫైర్ అయ్యారు. సంజయ్‌‌ ఈసీని విమర్శిస్తున్నారంటే అది మోడీని విమర్శించడమేనని, వాళ్లు చేస్తే సంసారం.. ఇంకొకరు చేస్తే వ్యభిచారం అన్నట్టుగా బీజేపీ నేతల తీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వంద మందిని మునుగోడుకు పంపామని అంటున్నారు. గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌ ఎన్నికలకు మోడీ, అమిత్‌‌ షా వచ్చారు కదా?’’ అని ప్రశ్నించారు. కమ్యూనిస్టులతో భవిష్యత్తులో కలిసి పని చేసే అంశంపై తమ అధినేత కేసీఆర్, ఆ పార్టీల అధిష్టానాలు చూసుకుంటాయని చెప్పారు. టీఆర్‌‌ఎస్‌‌ పేరును బీఆర్‌‌ఎస్‌‌గా మార్చే నిర్ణయాన్ని ఎవరు ఆపుతున్నారో చూడాలని, పార్టీ పేరు మారితేనే గుజరాత్‌‌ ఎన్నికల్లో పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. సమావేశంలో మంత్రులు మహమూద్‌‌ అలీ, శ్రీనివాస్‌‌ గౌడ్‌‌, సత్యవతి రాథోడ్‌‌, ఎంపీలు రంజిత్‌‌ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పాల్గొన్నారు.

ఓటమిని ఒప్పుకోవాలె...   

ఎన్నికలు డబ్బుమయం అయ్యాయన్న ఆరోపణలు దుబ్బాక, హుజూర్‌‌ నగర్‌‌, నాగార్జునసాగర్‌‌ ఉప ఎన్నికల్లో ఎందుకు రాలేదని కేటీఆర్ ప్రశ్నించారు. హుజూరాబాద్‌‌, మునుగోడులో ధనవంతులైన ఈటల రాజేందర్‌‌, రాజగోపాల్‌‌ రెడ్డికి బీజేపీ నాయకత్వం రూ.వందల కోట్లు ఇచ్చి పోటీకి దించింది కాబట్టే ఎన్నికలు డబ్బుమయం అయ్యాయని ఆరోపించారు. ‘‘ఓటమిని దర్జాగా ఒప్పుకునే హుందాతనం ఉండాలి. అధికార దుర్వినియోగం అంటూ అడ్డగోలుగా మాట్లాడటం సరికాదు. మునుగోడు ఓటమిపై బీజేపీ ఆత్మవిమర్శ చేసుకోవాలి” అని సూచించారు. బీజేపీ రెండు శిఖండి పార్టీలను ముందు పెట్టి ఓట్లు చీల్చే ప్రయత్నం చేసిందని, ఎప్పుడో తీసేసిన రోడ్డు రోలర్‌‌ గుర్తును తెచ్చారని మండిపడ్డారు. కారును పోలిన గుర్తులకు 6 వేల వరకు ఓట్లు వచ్చాయని, అవి లేకుంటే ఇంకా తమ పార్టీ మెజార్టీ పెరిగేదని చెప్పారు.