రైతు భరోసా సున్నా.. రుణమాఫీ అరసున్నా: కేటీఆర్​

రైతు భరోసా సున్నా.. రుణమాఫీ అరసున్నా: కేటీఆర్​
  • 20 వేల కోట్ల రైతు భరోసాను ప్రభుత్వం ఎగ్గొట్టింది
  • రైతులు ఆగమైతున్నా మంత్రివర్గ ఉపసంఘంలో చలనం లేదు
  • అసలు ఇస్తరో ఇయ్యరో అని రైతులు ఆందోళన చెందుతున్నరు
  • పింఛన్ల కోసం వృద్ధులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడిందని కామెంట్​ 

హైదరాబాద్, వెలుగు: యాసంగిపోయి వానాకాలం వచ్చినా.. ఆ వానాకాలం పోయి మళ్లీ యాసంగి వచ్చినా కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా ఇవ్వడం లేదని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ విమర్శించారు. ఒకప్పుడు గల్లా ఎగరేసిన రైతు.. ప్రస్తుత సర్కారు నిర్వాకంతో నేల చూపులు చూస్తున్నాడని అన్నారు. ‘రైతుభరోసా సాయం సున్నా.. రుణమాఫీ అరసున్నా.. రైతుబీమా గుండుసున్నా’ అని ఆయన బుధవారం ఓ ట్వీట్​లో విమర్శించారు. రుణం తీరక.. కొత్త రుణం రాక రైతన్న ఆగమైతున్నడని అన్నారు. అయినా కూడా రైతుభరోసాపై వేసిన మంత్రివర్గ ఉపసంఘం మాత్రం చలించడం లేదని విమర్శించారు.

రెండు విడతలుగా రూ.20 వేల కోట్ల రైతుభరోసాను ప్రభుత్వం ఎగ్గొట్టిందని, రూ.31 వేల కోట్ల రుణమాఫీ అని ప్రకటించి రూ.17 వేల కోట్లే ఇచ్చి.. తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అన్న చందంగా వ్యవహరిస్తున్నదన్నారు. రూ.15 వేల రైతు భరోసా కోసం రైతులు, కౌలురైతులు.. రూ.12 వేల సాయం కోసం రైతు కూలీలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. రెండు పంటలకే రైతుబంధు ఇస్తరా.. మూడో పంటకు ఇయ్యరా అని అధికారం కోసం బీరాలు పలికినోళ్లు.. మొదటిపంటకే రైతుభరోసా సాయం ఇవ్వడం లేదన్నారు. అసలు ఎన్ని ఎకరాలకు ఇస్తరో.. ఎప్పుడిస్తరో.. అసలు ఇస్తరో, ఇయ్యరో కూడా ఇప్పటికీ స్పష్టత లేదని కేటీఆర్​ విమర్శించారు. కాంగ్రెస్​ కరకు గుండెలు కరిగి రైతన్నల కష్టాలు తీరెదన్నడని అన్నారు.

ఇక, పింఛన్​ కోసం వృద్ధులు, వితంతువులు ఎదురు చూస్తున్నారని అన్నారు. ‘‘పింఛన్ల కోసం వృద్ధులు రోడ్డెక్కుతారని ఎవరనుకున్నారు? టంఛన్​గా అకౌంట్​లో పడే పైసలు ఆగిపోతాయని ఎవరనుకున్నారు? మూసీ బ్యూటిఫికేషన్ కోసం లక్షా యాభై వేల కోట్లు వెదజల్లి.. కనికరం లేకుండా వృద్ధుల పింఛన్​ డబ్బులను ఆపుతారని ఎవరనుకున్నారు? మందుబిల్లల కోసం కొడుకులు, కోడళ్ల దగ్గర చేయిచాచే అవసరమే లేని రోజుల నుంచి మళ్లీ వేడుకునే  వరకు ‘మార్పు’ వస్తుందని ఎవరనుకున్నారు? అణువణువునా కర్కశత్వాన్ని నింపుకున్న ఇందిరమ్మ రాజ్యంలో.. ఇంటింటా ఇక్కట్లే ఉంటాయని ఎవరనుకున్నారు? మార్పు ఇంత మోసగిస్తుందని ఎవరనుకున్నారు?’’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు. 

బీఆర్ఎస్​ గురుకుల బాట

గురుకులాల్లో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు ఈ నెల 30 నుంచి డిసెంబర్​7 వరకు గురుకుల బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు కేటీఆర్​ తెలిపారు. గురుకులాలతోపాటు కేజీబీవీ, మోడల్​ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్​ స్కూల్స్​లోని పరిస్థితులను పరిశీలిస్తామన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి పాలనను గాలికొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని, విద్యార్థుల మరణాలకు సీఎం రేవంత్​రెడ్డి కారణమని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 48 మంది గురుకుల విద్యార్థులు మరణించారన్నారు.

ఇప్పటిదాకా గురుకులాల్లో 38 ఫుడ్​ పాయిజన్​ ఘటనలు జరిగాయని విమర్శించారు. 886 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారన్నారు. సీఎంకు పాలనా అనుభవం లేకపోవడం, విద్యాశాఖనూ ఆయనదగ్గరే పెట్టుకుని నిర్లక్ష్యం చేస్తుండడం విద్యార్థులపాలిట శాపంగా మారిందన్నారు. ఆర్ఎస్​ ప్రవీణ్​ కుమార్​ నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో గురుకుల బడిబాట కార్యక్రమంపై అధ్యయన కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు కేటీఆర్​ తెలిపారు. ఈ కమిటీ అందించే నివేదిక ఆధారంగా ప్రభుత్వానికి గురుకుల సమస్యలపై పరిష్కారాలను సూచిస్తామన్నారు. సమస్యలపై అసెంబ్లీ సమావేశాల్లోనూ చర్చిస్తామని చెప్పారు.