పదేండ్ల ప్రగతి చక్రానికి పంక్చర్ చేశారు: కేటీఆర్

పదేండ్ల ప్రగతి చక్రానికి పంక్చర్ చేశారు: కేటీఆర్
  • బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేలా ఉంది
  • ఢిల్లీకి మూటలు పంపేలా బడ్జెట్
  • రుణమాఫీ అంకెలు ఎందుకు మారాయో సీఎం చెప్పాలని డిమాండ్

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసి.. పేకమేడలా కూల్చేలా ఉందని బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ బడ్జెట్ తో పదేండ్ల ప్రగతి చక్రానికి పంక్చర్ చేశారని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్‌‌‌‌‌‌‌‌‌‌ను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఈ బడ్జెట్ పేదల కష్టాలను తీర్చే విధంగా లేదని, ఢిల్లీకి మూటలు పంపించడానికి ఉపయోగపడేలా ఉందని ఆరోపించారు. 

ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలను బడ్జెట్‌‌‌‌లో ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. రుణమాఫీ జరిగిందో.. లేదో.. కాంగ్రెస్ నాయకులకే అర్థం కావడం లేదన్నారు. రుణమాఫీకి సంబంధించి అంకెలు ఎందుకు మారాయో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. పేదలు, ఆడబిడ్డలు, రైతులు రాష్ట్ర బడ్జెట్ కోసం ఎంతో ఆశతో ఎదురు చూశారని.. కానీ, భట్టి విక్రమార్క గంటన్నర ప్రసంగం తరువాత ఆరు గ్యారంటీలు గోవిందా అని అర్థమైందన్నారు. నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అనే మాటకు పాతర వేశారన్నారు. 

మహిళలకు నెలకు రూ.2,500, రూ.4 వేల పెన్షన్ వస్తుందని ఎదురుచూసిన వృద్ధులకు నిరాశే మిగిలిందన్నారు. కల్యాణమస్తు కింద తులం బంగారం దిక్కులేకుండా పోయిందన్నారు. స్విగ్గి, జొమాటో లాంటి గిగ్ వర్కర్ల కోసం బోర్డు పెడతామని రాహుల్ గాంధీ  స్వయంగా చెప్పినా కూడా దాని గురించి లేదన్నారు. పీఆర్సీ, పెండింగ్​లో ఉన్న ఐదు డీఏల గురించి  ప్రస్తావించలేదన్నారు. మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని రాహుల్ గాంధీ అశోక్ నగర్ లో హామీ ఇచ్చారని.. కానీ, నిరుద్యోగుల ఊసే ఎత్తడం లేదన్నారు. 

నిరుద్యోగ భృతి, రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు ప్రస్తావన లేదన్నారు. మూసీ బ్యూటిఫికేషన్ కాదని.. లూటిఫికేషన్ అని.. అది  మాత్రమే రేవంత్ ప్రథమ ప్రాధాన్యమని,  ఆ లూటిఫికేషన్ ద్వారానే ఢిల్లీకి మూటలు పంపుతున్నారని విమర్శించారు.  ఏ ఒక్క ఊర్లోనైనా వందకు వందశాతం రుణమాఫీ జరిగిందని రుజువు చేస్తే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తామన్నారు.