
- రాష్ట్ర చిహ్నాన్ని మార్చాల్సిన అవసరమేముంది?: కేటీఆర్
- చార్మినార్ వద్ద బీఆర్ఎస్ నేతల నిరసన
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్ను తొలగించడమంటే హైదరాబాదీలను అవమానించడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర చిహ్నాన్ని ఇంత అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటున్నదని మండిపడ్డారు. రాష్ట్ర చిహ్నం నుంచి చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేతలు గురువారం చార్మినార్ వద్ద నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని ప్రజల గుండెల్లో నుంచి ఎప్పటికీ తీసేయలేరని అన్నారు. ‘‘హైదరాబాద్ అంటే అందరికీ గుర్తొచ్చేది చార్మినార్. తెలంగాణ షాన్ హైదరాబాద్. హైదరాబాద్ అంటే దాని ప్రతీక చార్మినార్ అన్నట్టుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్ కు 400 ఏండ్లు పూర్తయినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే ఘనంగా ఉత్సవాలు నిర్వహించింది. అప్పుడు ఉత్సవాలు నిర్వహించిన కాంగ్రెస్ కు ఇప్పుడేమైందో చెప్పాల్సిన అవసరముంది” అని ఆయన అన్నారు.
‘‘ఎన్నో పోరాటాలు, త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నం. కానీ, పదేండ్లలో సాధించిన ప్రగతిని కాదని.. కాంగ్రెస్ సర్కార్ మొండి వైఖరి అవలంబిస్తున్నది. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రాజముద్రను మారుస్తున్నది. హైదరాబాద్ ప్రగతి, కేసీఆర్ పేరు కనిపించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. రాజముద్రలో అమరవీరుల స్థూపం, తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలను చేర్చితే అభ్యంతరం లేదు. అమరవీరుల స్థూపాన్ని రాజముద్రలో పెట్టినంత మాత్రాన.. రాష్ట్రం కోసం ప్రాణాత్యాగం చేసినోళ్ల తల్లిదండ్రులు సంతోషపడరు. చిహ్నంలో మార్పులు చేయాలనే నిర్ణయాన్ని సర్కారు వెనక్కి తీసుకోవాలి. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా నిరసన చేపడుతాం” అని కేటీఆర్ హెచ్చరించారు. బీఆర్ఎస్ నేతలు పద్మారావు గౌడ్, తాటికొండ రాజయ్య, మాగంటి గోపీనాథ్ నిరసనలో పాల్గొన్నారు.