- ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తున్నం
- విలువలతో కూడిన రాజకీయాలను కోరుకుంటున్నట్లు కామెంట్
హైదరాబాద్, వెలుగు: పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ నేతలు దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు ఏ మాత్రం చోటు లేదన్నారు. పార్టీ ప్రతి కార్యకర్తను కాపాడుకునే శక్తి, బలం, బలగం తమకు ఉన్నాయన్న విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. టీఆర్ ఎస్ కార్యకర్తల ఓపిక నశిస్తే, బీజేపీ కనీసం బయట తిరగలేని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. విలువలతో కూడిన రాజకీయాలు రాష్ట్రంలో కొనసాగాలని టీఆర్ ఎస్ పార్టీ కోరుకుంటున్నదని చెప్పారు. ప్రజాస్వామ్యంలో తమ వాదనతో ప్రజలను ఒప్పించడం చేతకాక, ఇతర పార్టీలపైన భౌతిక దాడులు చేస్తూ తమ వాదన వినిపించాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఆదివారం ఒక ప్రకటనలో ఆయన మండిపడ్డారు. బీజేపీ తీరును ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలోనూ బీజేపీ భౌతిక దాడులకు ప్రయత్నించిందని ఆరోపించారు. ‘‘బీజేపీ భౌతిక దాడులను ఎదుర్కొనే శక్తి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. మా ఓపికకు ఒక హద్దు ఉంటుంది.. ఇదే విషయంపై ఇప్పటికే బీజేపీని హెచ్చరించాం” అని కేటీఆర్ చెప్పారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ సమాజంలో చిచ్చు పెట్టేలా బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు.