ప్రశ్నిస్తున్నోళ్లను అరెస్ట్ చేయడం ఇందిరమ్మ రాజ్యమా?.. కౌశిక్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు అత్యంత దుర్మార్గమైన చర్య అని బీఆర్‌‌ఎస్  వర్కింగ్  ప్రెసిడెంట్  కేటీఆర్  అన్నారు. పూటకో అక్రమ కేసు పెట్టడం, రోజుకో బీఆర్ఎస్  నేతను అరెస్టు చేయడం రేవంత్  రెడ్డి సర్కారుకు అలవాటుగా మారిందని సోమవారం ఓ ప్రకటనలో  ఆయన పేర్కొన్నారు. రేవంత్  రెడ్డి తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారని అన్నారు. ‘‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను వెనకేసుకొచ్చి, బీఆర్ఎస్  ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఏకపక్షంగా అరెస్టు చేయడం పూర్తిగా అప్రజాస్వామికం. ప్రజల పక్షాన ప్రశ్నించిన కౌశిక్ పై కేసులు పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా?’’ అని కేటీఆర్  మండిపడ్డారు.

ఫిరాయింపుపై ప్రశ్నించినందుకే  అరెస్ట్  చేశారా?: హరీశ్ రావు

ఏ పార్టీ అంటూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకే కౌశిక్ రెడ్డిపై కేసు పెట్టారా అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు నిలదీశారు. 13 నెలల కాంగ్రెస్  పాలనలో కక్షపూరిత రాజకీయాలకు రాష్ట్రం నిలయంగా మారిందన్నారు.