
- జగదీశ్ రెడ్డి సస్పెండ్‌ను ఖండిస్తున్నం: కేటీఆర్
- అనని మాటలు అన్నట్లు చిత్రీకరించారు
- ప్రజాకోర్టులోనే కాంగ్రెస్‌కు శిక్షపడుతుందని వ్యాఖ్య
- ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపినందుకే సస్పెండ్: హరీశ్ రావు
- రాష్ట్ర అసెంబ్లీలో చీకటి రోజు అని ఫైర్
- ట్యాంక్‌బండ్ పై ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన
- నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపు
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపినందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డిని కాంగ్రెస్ సస్పెండ్ చేసిందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాష్ట్ర అసెంబ్లీలో ఇదొక చీకటి రోజు అని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ప్రజాపాలన లేదని.. నియంతృత్వ పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. అబద్ధాల ఆధారంగా జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేయడం దారుణమన్నారు. అనని మాటలు అన్నట్లు చిత్రీకరించారని తెలిపారు. సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే.. కాంట్రాక్టుల కమీషన్లు, ఢిల్లీకి మూటల విషయాలు బయటపెడ్తారన్న భయంతోనే తమ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఒక గొంతు నొక్కినంత మాత్రాన ఏదో సాధించామంటూ కాంగ్రెస్ నేతలు భ్రమ పడ్తున్నారని అన్నారు.
తమ సభ్యుడిని సస్పెండ్ చేసినందుకు ఈ ప్రభుత్వం ఇంతకింత అనుభవిస్తుందని మండిపడ్డారు. భవిష్యత్తులో ప్రజా కోర్టులోనే శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌కు నిరసనగా కేటీఆర్, హరీశ్ రావు నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ‘‘జగదీశ్ రెడ్డి సస్పెన్షన్‌కు నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలి.
జగదీశ్ రెడ్డి మాట్లాడటం మొదలుపెట్టిన ఐదు నిమిషాల్లోపే మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రన్నింగ్ కామెంట్రీ స్టార్ట్ చేశారు. అసభ్యకరంగా జగదీశ్ రెడ్డి ఒక్క మాట కూడా అనలేదు. స్పీకర్ మాకు తండ్రిలాంటివాళ్లు. అక్కడున్న ఆయనే మా హక్కులు కాపాడాలి’’అని కేటీఆర్ అన్నారు. స్పీకర్‌ను ఎవరూ అగౌరవపర్చలేదని తెలిపారు. ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు.. నియంతృత్వ పోకడలతో 5 గంటలు సభను వాయిదా వేసి జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేశారని విమర్శించారు. ‘‘శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిశాం. జగదీశ్ రెడ్డి అంశంపై అన్ని పార్టీల అభిప్రాయం మేరకు మూడ్ ఆఫ్ ద హౌస్ తెలుసుకోమని కోరాం. స్పీకర్ మీద ఉన్న గౌరవంతో సభ సజావుగా జరగడానికి సహకరిస్తామని స్పీకర్‌కు, మంత్రి శ్రీధర్ బాబుకు చెప్పినా పట్టించుకోలేదు’’అని కేటీఆర్ అన్నారు.
తప్పు చేస్తే క్షమాపణ చెప్పేందుకు సిద్ధం: హరీశ్ రావు
కాంగ్రెస్ పార్టీ పట్టపగలు ప్రజాస్వామ్యం గొంతు కోసిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ‘‘అసెంబ్లీ బయట ప్రశ్నిస్తే కేసులు, అక్రమంగా అరెస్ట్ చేస్తున్నరు. అసెంబ్లీలో ప్రశ్నిస్తే సస్పెండ్ చేసి గొంతు నొక్కుతున్నరు. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తి చూపినందుకే జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. జగదీశ్ రెడ్డి కామెంట్లపై స్పీకర్ ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబును కలిసి వివరణ ఇచ్చాం. తప్పు చేస్తే క్షమాపణ చెప్పడానికీ సిద్ధంగా ఉన్నామని చెప్పినం’’అని హరీశ్ అన్నారు.
డీలిమిటేషన్‌తో దక్షిణాదికి అన్యాయం
జనాభా ఆధారంగా కేంద్రం చేయాలనుకుంటున్న డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కేంద్రం సూచనల మేరకు కుటుంబ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసిన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్నాటకల ప్రాతినిథ్యాన్ని తగ్గించాలనుకోవడం దారుణమని మండిపడ్డారు.
తమిళనాడు మంత్రి కేఎన్.నెహ్రూ, రాజ్యసభ ఎంపీ ఎన్ఆర్.ఎలంగోలు గురువారం తెలంగాణభవన్‌లో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ నెల 22న చెన్నైలో తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి కేటీఆర్‌ను ఆహ్వానించారు.