కేక్‌ కట్‌ చేయిస్తా.. ఛాయ్‌, బిస్కెట్లు ఇస్తా: CM రేవంత్ బర్త్ డే వేళ కేటీఆర్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘హ్యాపీ బర్త్ డే రేవంత్ రెడ్డి’ అంటూ సోషల్ మీడియా వేదికగా రేవంత్ రెడ్డికి బర్త్ డే విషెస్ చెప్పారు. దీంతో పాటుగా.. పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో తాను విదేశాలకు పారిపోయినట్లు వస్తోన్న వార్తలపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. తాను ఎక్కడికి పోలేదని.. ప్రస్తుతం హైదరాబాద్‎లోనే ఉన్నానని స్పష్టం చేశారు. ‘‘నేను హైదరాబాద్‌లోనే ఉన్నాను.. మీ ప్రభుత్వ ఏజెన్సీలు ఎప్పుడైనా రావొచ్చు.. మీ బర్త్‌ డే సందర్భంగా కావాలంటే కేక్‌ కట్‌ చేయిస్తా.. ఛాయ్‌, ఉస్మానియా బిస్కెట్లు కూడా ఇస్తా’’ అంటూ కేటీఆర్‌ సెటైరికల్ ట్వీట్ చేశారు. 

కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్మూలా ఈ కార్ రేసింగ్‎లో నిధులు పక్కదారి పట్టించినట్లు కేటీఆర్‎పై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిధుల గోల్ మాల్ వ్యవహరంపై ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఫార్ములా ఈ  కార్ రేస్ వ్యవహారంలో రేపో ఎల్లుండో కేటీఆర్ అరెస్ట్ అవుతారంటూ తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు కేటీఆర్ విదేశాలకు పారిపోయాడంటూ వార్తలు రావడంతో ఆయన పై విధంగా క్లారిటీ ఇచ్చారు.