అసెంబ్లీలో సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పారు: కేటీఆర్

అసెంబ్లీలో సీఎం రేవంత్ అబద్ధాలు చెప్పారు: కేటీఆర్

సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ తన అసమర్థతను ఒప్పుకున్నారని, పాలన చేతకావడం లేదని అంగీకరించారని విమర్శించారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శల అనంతరం ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్.. రైతు భరోసా అమలుపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని అన్నారు.  రుణమాఫీపై నేతలు తలో మాట చపుతున్నారని విమర్శించారు. సీఎం చెప్పే కాకి లెక్కలు తాము నమ్మడం లేదని అన్నారు.  ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ నేతలను ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.

రైతుభరోసాపై షరతులు పెడతామని ఎన్నికల ముందు చెప్పలేదని, ఇప్పుడు ఐటీ చెల్లించేవారికి రైతు భరోసా ఇవ్వమని చెప్పడమేంటని ప్రశ్నించారు. రుణమాఫీపై సీఎం మాటలకు, మంత్రులు, ఎమ్మెల్యేల మాటలకు పొంతన లేదని అన్నారు. రుణమాఫీపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. 

అంతకు ముందు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీచర్చల్లో భాగంగా బీఆర్ఎస్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విషయం తెలిసిందే.  బీఆర్ఎస్ పదేళ్లలో సంపూర్ణంగా చేయలేని రుణమాఫీని తమ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఏడాదిలోనే చేసిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో కాలంలో కేవలం 27 వేల కోట్ల రుణమాఫీ చేస్తే.. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తక్కువ సమయంలో 20 వేల 616 కోట్లు రుణమాఫీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. రైతు భరోసాపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లలో కాళేశ్వరం కట్టి కూళేశ్వరంగా మార్చడం తప్ప ఏమీ చేయలేదని విమర్శించారు.