మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా?..వాస్తవాలను సర్కార్ తొక్కి పెడుతోంది: కేటీఆర్

మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యమా?..వాస్తవాలను సర్కార్ తొక్కి పెడుతోంది: కేటీఆర్
  • నిజనిర్ధారణకు వెళ్లిన వారిని సర్కారు ఎందుకు అడ్డుకుంటున్నది: కేటీఆర్​

హైదరాబాద్, వెలుగు: లగచర్లలో అర్ధరాత్రి గిరిజన ఆడబిడ్డలపై దమనకాండకు దిగిన ప్రభుత్వం.. పరిస్థితిని తెలుసుకునేందుకు వెళ్లిన మహిళా సంఘాల నేతలపైనా దౌర్జన్యం చేసిందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఆరోపించారు. నిజనిర్ధారణకు వెళ్లిన వారిని కాంగ్రెస్​ ప్రభుత్వం ఎందుకు అడ్డుకుంటున్నదని మంగళవారం ఓ ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. వాస్తవాలను తొక్కిపెట్టాలని ఈ సర్కారు ఎందుకు ప్రయత్నిస్తోందన్నారు. 

‘‘సీఎం సొంత ఇలాకాలో ఇంతటి నిర్బంధమా? కొడంగల్​ ఏమైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉందా? లేదంటే లగచర్ల చైనా బార్డర్​లోని కల్లోలిత ప్రాంతమా? పదేండ్లలో ఎన్నడూ లేని విధంగా ఇంటర్ నెట్ సేవలు నిలిపేశారు. కొడంగల్ కు వెళ్లే అన్ని దారుల్లో పోలీసు పహారా ఏర్పాటుచేశారు. కానీ, మీరెంత దాచే ప్రయత్నం చేసినా.. నిజం దాగదు. ఇప్పటికే లగచర్లలో కాంగ్రెస్​ సర్కారు కిరాతకం ఢిల్లీకి చేరింది.

 ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలను అడ్డుకోవడం అంటేనే.. కాంగ్రెస్ సర్కారు తప్పుచేసినట్టు ఒప్పుకున్నట్టే లెక్క. మహిళా సంఘాలను అడ్డుకున్నందుకు సర్కారు క్షమాపణలు చెప్పాలి. లగచర్లలో నిర్బంధాన్ని ఎత్తివేసి.. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి’’ అని ఆయన డిమాండ్​ చేశారు. హైదరాబాద్​సిటీలోని అపార్ట్​మెంట్లలో 20 కిలోవాట్ల విద్యుత్​ వినియోగం దాటితే ఆ అపార్ట్​మెంట్​వాసులే సొంతంగా ట్రాన్స్​ఫార్మర్లు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం చెప్పడం దారుణమని అన్నారు.