- కాంగ్రెస్ వస్తే మంచిది కాదని ముందే చెప్పినం
- సికింద్రాబాద్, బన్సీలాల్‌పేట, మల్లేపల్లి రోడ్‌షోలలో కేటీఆర్
సికింద్రాబాద్/పద్మారావునగర్/మెహిదీపట్నం, వెలుగు: హైదరాబాద్ సిటీకి వరదలొస్తే ముంపు బాధితులకు కేంద్రంలోని మోదీ సర్కార్ రూపాయి ఇవ్వలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. శుక్రవారం ఆయన సికింద్రాబాద్బీఆర్ఎస్ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్‌కు మద్దతుగా సీతాఫల్మండి, అడ్డగుట్ట, బన్సీలాల్ పేట జబ్బర్ కాంప్లెక్స్, మల్లేపల్లి ప్రాంతాల్లో రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ‘బడే భాయ్ మోదీ 2014లో మస్త్ కథలు చెప్పిండు.
రూ.15 లక్షలు, ప్రతి ఒక్కరికి ఇల్లు, ప్రతి ఇంటికి నల్లా, రైతుల ఆదాయం డబుల్, బుల్లెట్ ట్రైన్ అంటూ బిల్డప్ లు ఇచ్చిండు. నల్లధనం ఏదయ్యా మోదీ అంటే...తెల్లముఖం వేసిండు. కిషన్ రెడ్డి ఐదేండ్లుగా కేంద్రమంత్రిగా ఉన్నారు. ఇప్పటికీ పైసా పని చేయలేదు. ఆయన చేసిందల్లా కుర్ కురే ప్యాకెట్లు పంచుడే. హైదరాబాద్ లో వరదలొస్తే మోదీ రూపాయి ఇయ్యలే. మెట్రోకు పైసా ఇయ్యలే. అదే గుజరాత్ లో వరదలు వస్తే మాత్రం ప్రత్యేక విమానం వేసుకొని పోయి వెయ్యికోట్లు ఇచ్చిండు.’ అని మండిపడ్డారు.
మోదీ పప్పు, ఉప్పు, చింతపండు అన్ని పిరం చేసిన పిరమైన ప్రధాని అని విమర్శించారు. హామీల అమలులో సీఎం రేవంత్ రెడ్డిది కూడా బడా మోసమేనని కేటీఆర్ అన్నారు. ‘బస్సు ఫ్రీ, మహిళలకు రూ. 2,500, వృద్ధులకు 4 వేలు, తులం బంగారం, స్కూటీలు ఇస్తా అని రేవంత్ రెడ్డి అన్నాడు. చెప్పిన వాటిలో ఒక్కటైనా వచ్చిందా? కాంగ్రెస్ వస్తే మంచిది కాదని ముందే చెప్పినం. వాళ్ల కాళ్లు మంచివి కావు. కాంగ్రెస్ రాగానే రాష్ట్రంలో కరెంట్, నీటి కష్టాలు మొదలైనయ్. కేసీఆర్ సీఎం కాలేదని మీరు బాధపడుతున్నారు కదా?..10- లేదా 12 సీట్లు మీరు మాకిస్తే మళ్లీ రాష్ట్ర రాజకీయాలను కేసీఆరే శాసిస్తారు.
ఖైరతాబాద్ లో మన పార్టీ నుంచి గెలిచినోడు కాంగ్రెస్ లో జొర్రిండు. దానం నాగేందర్ అవకాశవాద రాజకీయ నాయకుడు. ఆయన మళ్లీ బీజేపీలో చేరడని గ్యారంటీ ఏందీ? ఇప్పుడొచ్చి ఓటు వేయమని అడుగుతుండు. ఎందుకు ఓటేయాలె. ఉన్న ఫించన్ ఎగకొట్టినందుకా? ఒక్కటే ఓటుతో అటు బడా భాయ్, ఇటు చోటా భాయ్ కి బుద్ధి చెప్పాలె. ఒక్క సికింద్రాబాద్ నుంచే పజ్జన్నకు 60 వేల మెజార్టీ ఇవ్వాలి" అని కేటీఆర్ కోరారు. రోడ్‌షోలో పద్మారావుగౌడ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ తోపాటు పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.