భూములు అమ్మితే గానీ.. ప్రభుత్వాన్ని నడపలేని దుస్థితి

భూములు అమ్మితే గానీ.. ప్రభుత్వాన్ని నడపలేని దుస్థితి
  • కేటీఆర్ విమర్శ

హైదరాబాద్, వెలుగు: భూములు అమ్మితేగానీ ప్రభుత్వాన్ని నడపలేని దుస్థితికి తెలంగాణను సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారని బీఆర్ఎస్​వర్కింగ్ ​ప్రెసిడెంట్​ కేటీఆర్​అన్నారు. రూ.30 వేల కోట్ల నిధుల కోసం హైదరాబాద్‌‌లోని విలువైన భూములను అడ్డికిపావుశేరుకు అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు బుధవారం ప్రకటన విడుదల చేశారు. బ్యాంకులో తనఖా పెట్టిన భూములనే వేలం వేసి అమ్ముకోవడం ప్రభుత్వ దివాళాకోరుతనానికి నిదర్శనమని అందులో పేర్కొన్నారు. 

రంగారెడ్డి జిల్లా కంచ గచ్చిబౌలిలో ఉన్న 400 ఎకరాల భూములను అమ్మడం లేదని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన సీఎం రేవంత్​.. ఊసరవెల్లి కంటే వేగంగా మాట మార్చారని మండిపడ్డారు.  ‘‘మా ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులతో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేసి, సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రైతులు, పేదలను ఆదుకున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేస్తోందని గతంలో అడ్డగోలుగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. సీఎం అయినప్పటి నుంచి అప్పులకే మొగ్గు చూపుతున్నారు. కేవలం 15 నెలల పాలనలోనే లక్షా 65 వేల కోట్ల పైచిలుకు అప్పు చేశారు” అని కేటీఆర్​ ఫైర్​ అయ్యారు.