ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే కాంగ్రెస్ కొట్టుకపోతది

 ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే కాంగ్రెస్ కొట్టుకపోతది
  • అంబేద్కర్ జయంతి వేడుకల్లో కేటీఆర్  

హైదరాబాద్, వెలుగు: ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ప్రజా సునామీలో కాంగ్రెస్  పార్టీ కొట్టుకుపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి లాంటి మోసగాడి పాలనను మన రాజ్యాంగ నిర్మాతలు చూసుంటే, రీకాల్ వ్యవస్థను ప్రవేశపెట్టి ఉండేవారని వ్యాఖ్యానించారు. సోమవారం అంబేద్కర్  జయంతి సందర్భంగా తెలంగాణ భవన్‌‌లో ఆయన చిత్రపటానికి కేటీఆర్  నివాళులర్పించి మాట్లాడారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను కాంగ్రెస్  నేతలు మోసం చేశారని ఫైరయ్యారు. ఎస్సీ డిక్లరేషన్  అమలులో సర్కారు ఘోరంగా విఫలమైందని విమర్శించారు. రేవంత్ రెడ్డి లాంటి మోసగాడు చెప్తే ప్రజలు నమ్మరని, మల్లికార్జున ఖర్గేను తీసుకొచ్చి ఎస్సీ రిజర్వేషన్  ప్రకటన చేయించారని పేర్కొన్నారు. దళిత డిక్లరేషన్ లో ఇచ్చిన హామీల సంగతి ఏమైందని ప్రశ్నించారు.

‘‘కాంగ్రెస్  అంటే కరువు. కరువు అంటే కాంగ్రెస్’’ అని ఎక్స్ లోనూ కేటీఆర్  పోస్ట్ చేశారు. కక్షతో కాళేశ్వరం పంపులను పడావు పెట్టారని, నిర్లక్ష్యంతో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పనులనూ పక్కనపెట్టారని మండిపడ్డారు. ఫలితంగా తలాపునే గోదావరి, కృష్ణా ఉన్నా పంటలు ఎండిపోయే  పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. కాగా.. వరంగల్ లో త్వరలో జరిగే బీఆర్ఎస్  రజతోత్సవ సభకు మద్దతు పలుకుతూ తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను ఆటో సంఘాల ప్రతినిధులు కలిశారు. సభ కోసం రూ. 26 వేల విరాళం చెక్కును కేటీఆర్ కు యూనియన్ ప్రతినిధులు అందజేశారు. ఆ విరాళాలను చనిపోయిన ఆటోడ్రైవర్ల కుటుంబాలకు ఇవ్వాలని కేటీఆర్  సూచించారు.