రేవంత్..ఏం చేస్కుంటవో చేస్కో..ఫార్ములా ఈ రేస్​లో అవినీతే లేదు..ఏసీబీ కేసు ఎలా పెడ్తది? : కేటీఆర్​

రేవంత్..ఏం చేస్కుంటవో చేస్కో..ఫార్ములా ఈ రేస్​లో అవినీతే లేదు..ఏసీబీ కేసు ఎలా పెడ్తది? : కేటీఆర్​

హైదరాబాద్​, వెలుగు : ఫార్ములా ఈ రేస్​లో అసలు కేసు ఎక్కడుందని బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ప్రశ్నించారు. ఇందులో అసలు అవినీతే లేదని, అలాంటప్పుడు ఏసీబీ కేసు ఎలా పెడుతుందని అన్నారు. ‘‘నేను ఏ తప్పూ చేయలేదు. అందుకే నాకు ఆత్మవిశ్వాసం, ఆత్మస్థైర్యం ఎక్కువ. ఉద్యమ నాయకుడి బిడ్డలం. భయపడే ప్రసక్తే లేదు. రేవంత్​.. ఏం చేస్కుంటవో చేస్కో. నా వెంట్రుక కూడా పీకలేవు’’ అని అన్నారు. ఫార్ములా ఈ రేస్​పై గురువారం ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో తెలంగాణ భవన్​లో కేటీఆర్​ మీడియాతో మాట్లాడారు.

రేవంత్​రెడ్డి తమ వెంట ఎందుకు పడుతున్నారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. కేసుపై న్యాయపరంగా, రాజకీయపరంగా కొట్లాడుతామని తెలిపారు. శాంతియుతంగా నిరసనలు చేస్తామని అన్నారు. ఏసీబీకి కేసు పెట్టే అర్హత లేదని కేటీఆర్​ పేర్కొన్నారు. గవర్నర్​కు ప్రభుత్వం ఏం చెప్పిందో తెలియదని, వాస్తవాలు తెలిస్తే ఆయన కూడా అనుమతిచ్చే వారు కాదేమోనని అన్నారు. సీఎం దివాళాకోరుతనం వల్లే కేసు పెట్టారని ఆరోపించారు. ముందు ఓఆర్ఆర్​ లీజు ఒప్పందాన్ని రద్దు చేసి, విచారణ జరిపించాలని  డిమాండ్​ చేశారు. 

కక్కలేక మింగలేక..

కుంభకోణమని ప్రభుత్వం చెబుతున్న ఫార్ములా ఈ రేస్​పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని స్పీకర్​ను కోరామని, కానీ, ప్రభుత్వం కక్కలేక మింగలేక అన్నట్టుగా వ్యవహరిస్తున్నదని కేటీఆర్​అన్నారు. సీఎంకు లేఖ రాసినా స్పందించలేదని చెప్పారు. ఆధారాలు లేకుండా ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నదని, ఆధారాలుంటే బయటపెట్టాలని డిమాండ్​చేశారు. అసెంబ్లీలో మాట్లాడలేని దద్దమ్మ సీఎం, మంత్రులు కేవలం లీకులతో దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేస్​ విషయంలో అణాపైసా కూడా వృథా కాలేదని, కాంగ్రెస్​ ప్రభుత్వం చేతగాని తనంవల్లే రేసులు రద్దయ్యాయని పేర్కొన్నారు. 

హైదరాబాద్​కు రూ.700 కోట్ల ప్రయోజనం

ప్రపంచంలో హైదరాబాద్​ను ఎలక్ట్రానిక్​ వెహికల్స్​(ఈవీ) రంగంలో అగ్రగామిగా నిలిపే ప్రయత్నంలో భాగంగానే ఫార్ములా ఈ రేస్​ను నిర్వహించామని కేటీఆర్​ చెప్పారు.  హెచ్ఎండీఏ తరఫున రూ.30 కోట్లు, ప్రైవేట్​ స్పాన్సర్​ ఏస్​ అర్బన్​ తరఫున మరో వంద కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆ వ్యయంతో హైదరాబాద్​కు రూ.700 కోట్ల ప్రయోజనం చేకూరిందని తెలిపారు. హెచ్ఎండీఏ వైస్​ చైర్మన్​ హోదాలో ప్రిన్సిపల్​ సెక్రటరీతో కలిసి నిర్ణయం తీసుకున్నామని, నిబంధనల మేరకే ఫైల్​ మూవ్​ చేసి.. ఫార్ములా ఈ నిర్వహణ సంస్థకు రూ.55 కోట్లను రెండు విడతల్లో ఇండియన్​ ఓవర్సీస్​ బ్యాంకు ద్వారా పారదర్శకంగా చెల్లింపులు చేశామని గుర్తు చేశారు.

తదుపరి చెల్లింపుల కోసం కొత్తగా ఏర్ప డిన కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని నిర్వహణ సంస్థ కోరిందన్నారు. ఎఫ్ఐఈ సంస్థ సహ వ్యవస్థాపకుడు ఆల్బర్టో లోంగోతో సీఎం రేవంత్​రెడ్డి,  అప్పటి హెచ్ఎండీఏ ప్రిన్సిపల్​ సెక్రటరీ దాన కిశోర్ సమావేశమయ్యారని తెలిపారు. సమావేశం అనంతరం ఫార్ములా ఈ రేస్​ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ప్రభుత్వా నికి సంస్థ లేఖ కూడా రాసిందన్నారు. అయితే, నిరుడు డిసెంబర్​ 13న సీఎంతో మీటింగ్​ తర్వాత.. డిసెంబర్​ 19న చెల్లించాల్సిన కాంట్రాక్టు ఫీజు నిబంధనలను ప్రస్తావించిందని చెప్పారు.

ప్రభుత్వం నుంచి స్పందనలేకపోవడంతో రేసు నిర్వహించలేమని డిసెంబర్​ 26న సంస్థ స్పష్టం చేసిందని పేర్కొన్నారు. సంస్థకు చెల్లించిన రూ.73 లక్షలను ఆ సంస్థ తిరిగి ఇచ్చేసిందన్నారు. కాగా, హైదరాబాద్​కు ఫార్ములా 1 రేస్​ను తీసుకొచ్చేందుకు 2001లోనే నాటి సీఎం చంద్రబాబు ప్రయత్నించారని, గోపన్ పల్లిలో 580 ఎకరాల భూసేకరణకు నోటిఫికేషన్​ ఇచ్చారని గుర్తు చేశారు.  

లగచర్ల చరిత్రలో నిలుస్తుంది 

లగచర్ల పేరు తెలంగాణ చరిత్రలో నిలిచిపోతుందని కేటీఆర్​ అన్నారు. కొడంగల్​ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్​ రెడ్డి, రైతులు జైలు నుంచి విడుదలైన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఒక నియంతృత్వ, మూర్ఖపు ప్రభుత్వ వైఖరికి నిరసనగా వారు చేసిన పోరాటం చరిత్రలో నిలుస్తుందని చెప్పారు. 

అదానీకి రేవంత్​ రెడ్​కార్పెట్..రాహుల్​కు లేఖ​

ఓ పక్క అదానీ, మోదీ ప్రభుత్వంపై రాహుల్​గాంధీ  పోరాడుతుంటే.. సీఎం రేవంత్​ రెడ్డి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్​ అన్నారు. రాష్ట్రంలో అదానీకి రేవంత్​ రెడ్​ కార్పెట్​ పరుస్తున్నారని విమర్శించారు. గురువారం రాహుల్​కు కేటీఆర్ ​లేఖ రాశారు.  

మేం కేసీఆర్​ సైనికులం : కవిత

అసెంబ్లీలో సీఎం రేవంత్​ రెడ్డి సమాధానం చెప్పలేక కేటీఆర్​పై అక్రమ కేసులు పెట్టారని బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత అన్నారు. కేసీఆర్, బీఆర్ఎస్​ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ట్వీట్​ చేశారు. తామంతా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన కేసీఆర్​ సైనికులమనే విషయాన్ని రేవంత్​ గుర్తుంచుకోవాలని సూచించారు.