అదానీతో ఒప్పందాలన్నీ రద్దు చేయాలి: కేటీఆర్

  • స్కిల్​ వర్సిటీకి ఇచ్చిన 100 కోట్లు వెనక్కి ఇచ్చేయాలి
  • కాంగ్రెస్​ హైకమాండ్​కు తెలియకుండానే ఇక్కడ ఒప్పందాలు జరిగినయా: కేటీఆర్

హైదరాబాద్​, వెలుగు: అదానీతో రాష్ట్ర ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ డిమాండ్ చేశారు. ‘‘సీఎం రేవంత్​రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లి అదానీని గజదొంగ అంటడు. కానీ, హైదరాబాద్​లో మాత్రం గజమాలలు వేసి స్వాగతం పలుకుతడు” అని ఆయన విమర్శించారు. 

స్కిల్​ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.వంద కోట్లను సర్కారు వెనక్కు ఇచ్చేయాలన్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎన్నోసార్లు అదానీ ప్రయత్నించినా తమ హయాంలో ఓకే  చెప్పలేదని తెలిపారు. మర్యాదపూర్వకంగా ఓ చాయ్​ తాగించి పంపించేశామని, ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని కేటీఆర్​ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్​లో మీడియాతో మాట్లాడారు. 

‘‘అవినీతిపరుడని రాహుల్​ గాంధీ ఆరోపించిన వ్యక్తికే ఇక్కడి ప్రభుత్వం రెడ్​ కార్పెట్​ వేసింది. బడేభాయ్​ ఆదేశించగానే.. ఇక్కడ ఛోటేభాయ్​ అమలు పరిచిండు. రాష్ట్రంలో కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక అదానీ సంస్థలతో రూ.12,400 కోట్లతో ఒప్పందాలు చేసుకున్నట్టు వాళ్లే చెప్పుకున్నరు. రూ.5 వేల కోట్లతో గ్రీన్​ ఎనర్జీ, రూ.5 వేల కోట్లతో డేటా సెంటర్​తో పాటు సిమెంట్​ పరిశ్రమకు అనుమతులిచ్చారు” అని దుయ్యబట్టారు. 

యాదాద్రి జిల్లాలోని రామన్నపేటలో సిమెంట్​ ఫ్యాక్టరీ వద్దని అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నా సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. మూసీ శుద్ధి గురించి మాట్లాడే ప్రభుత్వం.. సిమెంట్​ ఫ్యాక్టరీతో మురికిమయం అవుతుందని నిపుణులు చెప్తున్నా పట్టించుకోవట్లేదన్నారు. డిస్కంలనూ అదానీకి అప్పగించే కుట్ర చేశారని, అందులో ఓల్డ్​ సిటీ బిల్లులను అదానీతో వసూలు చేయించే డ్రామాను మొదలుపెట్టారని దుయ్యబట్టారు. 

డిస్కంలను ప్రైవేటీకరించేందుకు కుట్ర చేశారని, అందుకే అదానీ గుండె ఉప్పొంగిపోయి స్కిల్​ వర్సిటీకి రూ.100 కోట్ల విరాళం ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో అదానీ సామ్రాజ్యాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయం  కాంగ్రెస్​ హైకమాండ్​కు తెలియదా అని ప్రశ్నించారు. అదానీని రోజూ విమర్శించే రాహుల్​.. ఈ ఒప్పందాలకు మద్దతిస్తున్నారా? అని అడిగారు. బ్యాడ్​ అదానీ.. గుడ్​ అదానీ అనే చందంగా కాంగ్రెస్​ వ్యవహరిస్తున్నదని దుయ్యబట్టారు.  

ప్రధాని ఎందుకు పట్టించుకుంటలే

అదానీ బండారం అంతర్జాతీయంగా బయటపడినా ప్రధాని మోదీ మాత్రం పట్టించుకోవడం లేదని కేటీఆర్​ విమర్శించారు. అదానీపై కేసు పెట్టాలని, జేపీసీ వేయాలని డిమాండ్​ చేసినా పెడచెవిన పెడుతున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్​కు రాహుల్​ ఫోన్​ చేసి ఒప్పందాలు రద్దు చేసుకోవాలని చెప్పాలని ఆయన అన్నారు. ‘‘అదానీతో వ్యాపారం చేస్తున్న ప్రధాని అవినీతిపరుడంటూ రాహుల్​ ఆరోపిస్తున్నడు. 

కానీ, అదే అదానీతో రేవంత్​ వ్యాపారం చేస్తే ఎలా నీతిపరుడవుతడు. అదానీతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలు రాహుల్​కు తెలిసి జరుగుతుండొచ్చు. లేదంటే వెంటనే రేవంత్​ పై చర్యలు తీసుకోవాలి” అని డిమాండ్​ చేశారు. రాజకీయాల్లోనూ అదానీ వేలు పెడుతున్నారని, మహారాష్ట్రలో ఎన్సీపీలో చీలిక తెచ్చారని  ఆరోపించారు.

 కోహినూర్​ హోటల్​లో అదానీతో మంత్రి పొంగులేటి సమావేశమయ్యారని, అదానీ వ్యవహారంలో కాంగ్రెస్​, బీజేపీ విధానాలు ఒకటేనని దుయ్యబట్టారు. కాగా, ఎమ్మెల్యేల ఫిరాయింపు విషయంలో వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలంటూ అసెంబ్లీ స్పీకర్​ను హైకోర్టు ఆదేశించిందన్నారు. లగచర్ల అంశానికి సంబంధించి.. రేవంత్​ రెడ్డికి దమ్ముంటే అక్కడికే వెళ్లి ప్రజలకు సమాధానం చెప్పాలని కేటీఆర్​ సవాల్​ చేశారు.