మా ఎమ్మెల్యేలపై కేసులను వెనక్కి తీసుకోండి : కేటీఆర్

మా ఎమ్మెల్యేలపై కేసులను వెనక్కి తీసుకోండి : కేటీఆర్
  • రాష్ట్ర ప్రభుత్వానికి బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్‌‌‌‌ రెడ్డి, కోవా లక్ష్మిపై కేసులు నమోదు చేయడాన్ని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. ఈ మేరకు కేటీఆర్ బుధవారం ట్వీట్ చేశారు. ప్రతిపక్షాల నోరు మూయించాలనే కుట్రతో రాష్ట్ర ప్రభుత్వం అక్రమ కేసులకు తెరతీస్తున్నదని దుయ్యబట్టారు. వెంటనే ఆ కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రశ్నించే మీడియా, ప్రజాప్రతినిధులపైనా కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇందిరమ్మ పాలన, ప్రజాపాలన అంటే ఇదేనా అని నిలదీశారు. కాగా, ఇటీవల సూసైడ్‌‌‌‌ చేసుకున్న చేనేత కార్మికుడు పల్లె యాదగిరిది ఆత్మహత్య కాదని, ప్రభుత్వం చేసిన హత్యేనని మండిపడ్డారు. ఆ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌‌‌‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. మరోవైపు, ఏఈఈ (సివిల్) పోస్టులకు పరీక్ష రాసిన అభ్యర్థులు నందినగర్‌‌‌‌‌‌‌‌లోని కేటీఆర్‌‌‌‌‌‌‌‌ను నివాసంలో కలిశారు. ఏఈఈ పరీక్షల్లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. ఈ క్రమంలో అభ్యర్థులకు తాను అండగా ఉంటానని కేటీఆర్ భరోసా ఇచ్చారు. వెంటనే టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి, ఎంపికైన అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.