సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ.. ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చకు డిమాండ్

సీఎం రేవంత్కు కేటీఆర్ బహిరంగ లేఖ.. ఫార్ములా-ఈ రేస్ అంశంపై  అసెంబ్లీలో చర్చకు డిమాండ్

హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. శాసనసభలో ఫార్ములా-ఈ రేస్ అంశంపై చర్చ జరపాలని ఈ లేఖలో కేటీఆర్ డిమాండ్ చేశారు. దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని కేటీఆర్ సవాల్ చేశారు. ఈ అంశంలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, కేసులు పెడతామని, గవర్నర్ ఆమోదం వచ్చిందని లీకులు ఇస్తున్నారని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. నాలుగు గోడల మధ్య చర్చ కన్నా.. అసెంబ్లీలో చర్చ జరిగితే బాగుంటుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం రూ.55 కోట్లు విదేశీ కంపెనీలకు చెల్లించారు. అయితే అప్పట్లో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే హెచ్ఎండీఏ నిధులను విదేశీ సంస్థలకు మళ్లించారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ వ్యవహారంపై గవర్నర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు లేఖ రాసింది. ఏసీబీకి కూడా మున్సిపల్ శాఖ ఫిర్యాదు చేసింది. ఫార్ములా ఈ రేస్‌‌‌‌‌‌‌‌ కోసం జరిగిన బ్యాంక్ లావాదేవీలపై ఏసీబీ ఆరా తీసింది. పెట్టుబడులను రాబట్టే వ్యూహం పేరుతో గత సర్కారు హుస్సేన్ సాగర్ చుట్టూ ప్రత్యేక ట్రాక్ ఏర్పాటు చేసి రాకపోకలను నిషేధించి ఫార్ములా ఈ రేసింగ్ నిర్వహించింది. ఇందుకోసం భారీగా ఖర్చు చేసింది.

ఫార్ములా–ఈ కార్ల రేస్పై వివాదం ఏంటంటే..
హైదరాబాద్లో ఫార్ములా–ఈ కార్ల రేస్​ అగ్రిమెంట్ వెనుక భారీ అవినీతి బాగోతం బయటపడింది. గత బీఆర్ఎస్​ ప్రభుత్వంలో ‘కీ’ రోల్లో ఉన్న ఉన్నతాధికారి అర్వింద్​కుమార్​ అడ్డదారిలో ఈ ఒప్పందం చేసుకున్నట్లు తేలింది.

కేబినెట్​అనుమతి లేకుండానే రేస్ నిర్వహణకు రూ.55 కోట్లు అడ్వాన్స్గా ముట్టజెప్పినట్లు బయటపడింది. అది కూడా ఎన్నికల కోడ్​అమలులో ఉన్న టైమ్లో!! కేవలం ఫోన్ల ద్వారానే ఇదంతా నడిపించారు. దీన్ని గుర్తించి ప్రస్తుత ప్రభుత్వం.. రూ. 55 కోట్లు చెల్లించాలని అర్వింద్​కుమార్కు నోటీసు జారీ చేసినట్లు సమాచారం. 

అత్యంత రద్దీగా ఉండే ట్యాంక్​బండ్​ చుట్టూ ఐమాక్స్​ సమీపంలో 2023లో కార్ల రేసింగ్ (ఫార్ములా రేస్​ సీజన్​ ఈవెంట్​9)​ను నిర్వహించారు. దీని వల్ల హైదరాబాద్ జనం నానా తిప్పలు పడ్డారు. అప్పుడు రేసింగ్​ రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు హెచ్ఎండీఏ రూ.20 కోట్లు, రేస్కు ప్రమోటర్గా ఉన్న నెక్స్ట్ జెన్​అనే ప్రైవేట్​ఏజెన్సీ దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేసింది.

క్యాంపెయిన్తో పాటు స్టాల్స్, సీటింగ్, స్ట్రీట్​ లైట్లు.. ఇతర ఖర్చులన్నీ ఆ ఏజెన్సీ భరించింది. సీజన్​ 9 ఈవెంట్​నిర్వహణకు హెచ్ఎండీఏ, నెక్స్ట్ జెన్​, ఫార్ములా–ఈ  కంపెనీల మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. సీజన్​9 నిర్వహణ వల్ల హెచ్​ఎండీఏకు గానీ, నెక్ట్స్​ జెన్​ సంస్థకు గానీ ఎలాంటి లాభం రాకపోగా భారీగా నష్టమే మిగిలింది.