
- మోదీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: పర్యావరణ పరిరక్షణపై ప్రధాని నరేంద్ర మోదీ తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కంచ గచ్చిబౌలి భూముల ఆర్థిక అక్రమాలపై విచారణ చేపట్టి.. కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు కాలేదని నిరూపించుకోవాలని శుక్రవారం ‘ఎక్స్’లో చేసిన పోస్ట్‌లో పేర్కొన్నారు. హెచ్‌సీయూ భూముల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన విధ్వంసంపై ప్రధాని మాట్లాడింది బూటకం కాకుంటే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
‘‘కంచ గచ్చిబౌలి అంశం కేవలం వందల ఎకరాల పర్యావరణ విధ్వంసమే కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రూ.10 వేల కోట్ల ఆర్థిక మోసం. ఈ వ్యవహారంపై కేంద్రం వెంటనే విచారణ జరిపించాలి. కాంగ్రెస్ చేసిన ఆర్థిక అవకతవకలపై ఆధారాలతో సహా సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సీబీఐ, ఆర్బీఐ, సెబీ, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆర్గనైజేషన్లకు తెలియజేశాం.
సుప్రీంకోర్టు పంపిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కూడా ఆర్థిక అవకతవకలు జరిగినట్టు నిర్ధారించింది. సిటీలు వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణ కూడా అత్యంత ప్రాధాన్యాంశం. కానీ, అక్రమంగా వ్యవస్థలను మోసం చేసి పర్యావరణ విధ్వంసం చేసిన రేవంత్ రెడ్డి లాంటి నేతలను ప్రజల ముందు నిలబెట్టాల్సిన అవసరం ఉంది’’అని కేటీఆర్ పేర్కొన్నారు.