- సుంకిశాల ఘటనపై విచారణ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా చర్యలేవీ?
- మేఘా క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్లే సుంకిశాల వాల్ కూలింది
- ఆ కంపెనీకి కొడంగల్ లిఫ్ట్‌లో రూ.4,350 కోట్ల పనులేంది?
- మేడిగడ్డలో ఒక పర్రెను పట్టుకొని ఎన్నికల్లో లబ్ధి పొందారు
- రేవంత్ చెప్పినట్లు ఐఏఎస్‌లు సంతకాలు పెడ్తే ఉద్యోగాలు ఊడ్తయ్
- మేం అధికారంలోకి వచ్చినంక అన్నింటిపై విచారణ జరిపిస్తం
- ఎవరు, ఎప్పుడు అరెస్ట్ అవుతారో పొంగులేటి చెప్పడమేందని ప్రశ్న
హైదరాబాద్, వెలుగు: సాగునీటి రంగాన్ని దేశంలో ఎవరూ చేయని విధంగా కేసీఆర్ అభివృద్ధి చేశారని, అందులో భాగంగానే ఎవరూ కట్టలేని విధంగా కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అంటూ కామెంట్ చేశారని, ఆ కంపెనీ క్రిమినల్ నెగ్లిజెన్స్ వల్లే సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోయిందని, మేఘా కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు.
‘‘సుంకిశాల కూలేందుకు కారణమైన ఆ ఆంధ్ర కంపెనీ, ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఆ అరాచక కంపెనీపై ఇప్పుడు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?” అని ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. మేడిగడ్డ కుంగితే కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్ష కోట్లు నీళ్లలో పోశారంటూ కాంగ్రెస్ వాళ్లు ప్రచారం చేశారని, జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయిస్తున్నామన్నారని తెలిపారు. మరి, సుంకిశాల ఘటనలో మాత్రం ఎందుకు జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయించడం లేదని ప్రశ్నించారు. నలుగురు అధికారులను సస్పెండ్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకున్నదని, కంపెనీని మాత్రం బ్లాక్‌లిస్ట్‌లో పెట్టలేదని మండిపడ్డారు.
‘వెలుగు’ పేపర్లో ప్రచురితమైన ‘సుంకిశాల ఘటనలో కాంట్రాక్టర్‌పై చర్యలేవీ’ కథనాన్ని ఆయన చూపించారు. ఆ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టాలంటూ విచారణ కమిటీ రిపోర్ట్ ఇచ్చినా చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. సుంకిశాల ఘటనలో మేఘాపై చర్యలు తీసుకోవాలని, ఆ కాంట్రాక్ట్‌ను రద్దు చేయాలని, మేఘా చేసిన పనులకు దేశమంతా బ్లాక్‌లిస్టులో పెట్టాలని డిమాండ్ చేశారు. ‘‘రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘా సంస్థను ఈస్ట్ ఇండియా కంపెనీ అంటూ కామెంట్ చేసిండు.
మేఘా కమీషన్ల కోసమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై మౌనంగా ఉన్నారంటూ ఆరోపణలు చేసిండు. మేఘా కృష్ణా రెడ్డి ఓ పొలిటికల్ మాఫియా అంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నడు. ఇప్పుడెందుకు చర్యలు తీసుకోవడం లేదు” అని ప్రశ్నించారు. మేడిగడ్డలో ఓ పర్రెను పట్టుకుని లక్ష కోట్ల కుంభకోణమంటూ ప్రచారం చేసి ఎన్నికల్లో ప్రయోజనం పొందారని ఆయన వ్యాఖ్యానించారు.
బండి సంజయ్ ఎందుకు మాట్లాడ్తలే?
పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మేఘా సంస్థకు రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లను కట్టబెడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కోసం రూ.4,350 కోట్ల టెండర్‌ను మేఘా సంస్థకు అప్పగించారని, బ్లాక్‌లిస్టులో పెట్టాలన్న సంస్థకు కాంట్రాక్ట్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కొడంగల్ లిఫ్ట్ స్కీమ్ కూడా పెద్ద కుంభకోణమని, వెంటనే ఆ టెండర్లనూ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ‘‘స్కిల్ యూనివర్సిటీకి రూ.200 కోట్ల విరాళం ఇచ్చినందుకే మేఘాకు కొడంగల్ కాంట్రాక్ట్ ఇచ్చారా?” అని మండిపడ్డారు.
‘‘కాళేశ్వరం నీళ్లను గండిపేటలో కలిపి మూసీలో పంపిస్తామంటున్నారు. దాని కోసం రూ.5,500 కోట్లు ఖర్చు చేస్తారట. ఇది మరో కుంభకోణం. కొండపోచమ్మసాగర్ నుంచి గోదావరి జలాలను హైదరాబాద్‌కు తీసుకొచ్చేందుకు మేం రూ.1100 కోట్లతో అన్నీ సిద్ధం చేశాం. కానీ, దాని రూట్ మార్చి ఖర్చును రూ.5500 కోట్లకు పెంచారు. ఈ ప్రాజెక్ట్‌నూ ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్న మేఘాకే ఇచ్చేందుకు ఒప్పందాలు చేసుకున్నారు” అని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు సంతకం పెడితే ఐఏఎస్‌లు, ఇంజనీర్ల ఉద్యోగాలు ఊడడం ఖాయమని, తాము అధికారంలోకి వస్తే విచారణ చేయిస్తామని కేటీఆర్ అన్నారు.
‘‘రేవంత్ రెడ్డి సహాయ మంత్రి అయిన బండి సంజయ్ దీని మీద ఎందుకు మాట్లాడడం లేదు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణ గురించి మాట్లాడే ప్రధాని మోదీ.. చర్యలు మాత్రం తీసుకోవడం లేదు” అని కేటీఆర్ ప్రశ్నించారు. ‘‘రేవంత్ రెడ్డి తన బామ్మర్దికి అమృత్ టెండర్లు.. మేఘా, రాఘవ సంస్థలకు ప్రాజెక్టులను పంచుతున్నారు. అమృత్ టెండర్ల విషయంలో సీఎం బామ్మర్దిపై కేంద్ర సంస్థలు ఎందుకు విచారించడం లేదు? అరెస్టులంటూ పొంగులేటి అందరి జాతకాలు చెప్తున్నడు. ముందు ఆయనెప్పుడు జైలుకు వెళ్తారో చూసుకోవాలి. ఎవరు, ఎప్పుడు అరెస్ట్ అవుతారో ఆయనెట్ల చెప్తడు?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు .
‘‘అదానీతో కాంగ్రెస్ సంబంధాలు ఎట్ల బలపడుతున్నాయో అందరికీ తెలుసు. గౌతమ్ అదానీ కుమారుడు కరణ్ అదానీతో సీఎం రేవంత్ రెడ్డి తన ఇంట్లోనే నాలుగు గంటల పాటు చర్చలు జరిపారు. కలిసి విందు చేశారు. మోదీ కోసం దామగుండం, అదానీకి సిమెంట్ ఫ్యాక్టరీ, మేఘా కృష్ణారెడ్డికి అన్ని ప్రాజెక్టులూ ఇస్తున్నారు. రాయదుర్గంలో 84 ఎకరాలను కూడా అదానీకి అప్పజెప్పే ప్రయత్నం చేస్తున్నారు” అని కేటీఆర్ ఆరోపించారు.