గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలి

గ్రూప్స్ పరీక్షలు వాయిదా వేయాలి

టీజీపీఎస్సీ ముట్టడికి నిరుద్యోగుల యత్నం , అరెస్ట్ చేసిన పోలీసులు

హైదరాబాద్, వెలుగు: గ్రూప్–2, గ్రూప్–3 పరీక్షలు వాయిదా వేయాలని, పోస్టుల సంఖ్య పెంచాలని డిమాండ్  చేస్తూ నిరుద్యోగ జేఏసీ చేపట్టిన చలో టీజీపీఎస్సీ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆందోళన చేసేందుకు వచ్చిన నిరుద్యోగులను పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం చలో టీజీపీఎస్సీకి జేఏసీ పిలుపు నేపథ్యంలో కమిషన్  ఆఫీసు చుట్టూ పోలీసులు ముండ్ల కంచెలు వేసి భారీగా మోహరించారు. దశలవారీగా ఓయూ జేఏసీ, నిరుద్యోగ జేఏసీ, బీఆర్ఎస్​వీ, బీజేవైఎం ప్రతినిధులు టీజీపీఎస్సీ ముట్టడికి రాగా, వారిని అడ్డుకొని గోషామహల్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

ఈ సందర్భంగా నాయకులు సురేష్  యాదవ్, సంజీవ్  నాయక్, గెల్లు శ్రీనివాస్  యాదవ్, రాజారాం యాదవ్, మహేందర్  తదితరులు  మాట్లాడుతూ... గ్రూప్ 2 పోస్టుల సంఖ్యను 2 వేలకు పెంచాలని, గ్రూప్ 3 పోస్టులను 3 వేలకు పెంచాలని డిమాండ్  చేశారు. గ్రూప్ 1లో 1:100 రేషియోలో అభ్యర్థులను మెయిన్స్ కు ఎంపిక చేయాలని, 25 వేలతో మెగా డీఎస్సీ ప్రకటించాలని కోరారు.

శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వస్తే పోలీసులతో అరెస్టులు చేయించడం సరికాదన్నారు. పోటీ పరీక్షలను మూడు నెలల పాటు వాయిదా వేయాలన్నారు. ఇండ్లలోకి, హాస్టళ్లలోకి వెళ్లి అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. జీవో 46 బాధితులకు న్యాయం చేయాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోతే, పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్టులా?: కేటీఆర్ 

టీజీపీఎస్సీ ముట్టడికి ప్రయత్నించిన నిరుద్యోగులు, బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్  నాయకుల అరెస్టును ఆ పార్టీ వర్కింగ్  ప్రెసిడెంట్ కేటీఆర్  ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన నిరుద్యోగులను అరెస్టు చేయడం ఏంటని  ట్విటర్ లో ఆయన ప్రశ్నించారు.