తెలంగాణ రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు, మున్సిపాలిటీల్లో వర్షాకాల ప్రణాళికలపైన మంత్రి కేటీఆర్ పురపాలక శాఖలోని వివిధ విభాగాల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వర్షాకాలంలో రాష్ట్రంలోని పురపాలికలతోపాటు హైదరాబాద్ నగరంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు చేపట్టిన కార్యక్రమాల గురించి మంత్రి అడిగి తెలుసుకున్నారు. లోతట్టు ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో అవసరమైన డీవాటరింగ్ పంపులు ఇతర ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఎట్లాంటి పరిస్థితుల్లోనూ ప్రాణ నష్టం జరగకుండా చూడడమే అధికారుల ప్రథమ ప్రాధాన్యతగా ఉండాలని మంత్రి సూచించారు.
వర్షాకాల ప్రణాళికతో పాటు, జిహెచ్ఎంసిలో ఇటీవల ప్రారంభించిన వార్డు కార్యాలయాల పనితీరు పైన మంత్రి కేటీఆర్ ఈ సమావేశంలో ప్రత్యేకంగా చర్చించారు. వార్డు కార్యాలయాల వ్యవస్థ ప్రారంభ దశలో ఉన్నదని, ఈ నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ దిశగా జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు ప్రత్యేక చొరవ చూపాలని, ప్రతిరోజు వార్డు కార్యాలయ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ప్రత్యేకంగా పర్యవేక్షించాలని కోరారు. నగర పౌరులు వార్డు కార్యాలయ వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించుకొనేలా ప్రయత్నాలు చేయాలని, వార్డు కార్యాలయ వ్యవస్థకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకునేలా ప్రత్యేకంగా ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని జిహెచ్ఎంసి అధికారులకు మంత్రి కేటీఆర్ ఆదేశాలు జారీ చేశారు. వార్డు కార్యాలయ వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న అన్ని విభాగాల అధికారులు రానున్న కొన్ని వారాలపాటు ప్రత్యేకంగా అంతర్గత సమీక్షలు నిర్వహించుకొని వార్డు కార్యాలయ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచేందుకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అధికారులకు సూచించారు.
హైదరాబాద్ నగరం పైన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించిన మంత్రి కేటీఆర్ భారీ వర్షాలను, వరదలను దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. ఈ సందర్భంగా జిహెచ్ఎంసి చేపట్టిన స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ కార్యక్రమం (SNDP) పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. చేపట్టిన మెజారిటీ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి అని... గత సంవత్సరంతో పోలిస్తే వరద ప్రమాదం అనేక కాలనీలకు తప్పిందని SNDP విభాగం అధికారులు మంత్రికి తెలియచేసారు. నగరవ్యాప్తంగా ఉన్న చెరువులన్నింటికి సంబంధించిన నీటి నిల్వ స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని, ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల ప్రకారం వాటి నిలువలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని మంత్రి సూచించారు. వర్షాకాల ప్రణాళికకు సంబంధించి గత కొంతకాలంగా పురపాలికలు ఏర్పాట్లను చేసుకుంటున్నాయని, జిహెచ్ఎంసి మరియు రాష్ట్రంలోని ఇతర పురపాలికలు నాళాల సేఫ్టీ ఆడిట్ ని పూర్తి చేసినట్లు ఈ సందర్భంగా అధికారులు మంత్రి కేటీఆర్ కి తెలిపారు.