దిక్కుమాలిన కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లి మంచినీళ్ల యుద్ధమేనన్నారు మంత్రి కేటీఆర్. మొండి చెయ్యికి ఓటేస్తే మళ్లీ కరెంటు కష్టాలు తప్పవన్నారు. కాంగ్రెస్ చచ్చిన పామని.. వ్యారంటీ లేని కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ ఎలా ఇస్తుందని ప్రశ్నించారు. సాగునీరు, తాగునీరు ఇవ్వని కాంగ్రెస్ గ్యారంటీలు ఇస్తా అంటే నమ్మొద్దన్నారు. కాంగ్రెస్ కు ఓటేస్తే మళ్లీ రైతులు ఎరువులు, విత్తనాల కోసం క్యూ కట్టాల్సి వస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికో ముఖ్యమంత్రి మారుతారన్నారు. ఇంకా కాంగ్రెస్ కు ఎన్ని అవకాశాలు ఇవ్వాలని ప్రశ్నించారు. సిరిసిల్ల జిల్లా గంభీరావు పేటలో లబ్ధిదారులకు 378 డబుల్ బెడ్రూం ఇళ్లను పంపిణీ చేశారు కేటీఆర్.
ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన... గంభీరావుపేటలో 365 రోజులు మంచినీళ్లకు ఢోకా లేదన్నారు కేటీఆర్. మన రాష్ట్రంలో ఉన్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. రైతుల ఖాతాలో 73 వేల కోట్లు వేశామని చెప్పారు. రెండు వందల పెన్షన్ ఇవ్వలేనేళ్లు.. 4 వేల పెన్షన్ ఇస్తారంటే నమ్మాలా అని ప్రశ్నించారు . తాము లక్ష రుణమాఫీ చేస్తే.. కాంగ్రెస్ 2లక్షలు చేస్తామని చెబుతోందని.. కేసీఆర్ 2 వేల పెన్షన్ ఇస్తే.. వాళ్లు 4 వేలు అంటున్నారు..ఓట్ల కోసం కాంగ్రెస్ ఎన్నైనా చెబుతుందన్నారు. 65 ఏళ్లు చేయలేనోళ్లు ఇవాళ వచ్చి ఏదో చేస్తారంటే ఎవరూ నమ్మబోరన్నారు కేటీఆర్.
Also Read :- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఈ రూట్లలో ట్రాఫిక్ జామ్
ఎన్నికల్లో మందు, డబ్బు పంచనని చెప్పానని.. అలా చెప్పడానికి చాలా ధైర్యం కావాలన్నారు కేటీఆర్. 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే రాష్ట్రం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. రైతుల కోసం సీఎం కేసీఆర్ ఎన్నో కార్యక్రమాలు చేశారని చెప్పారు. రైతుబంధు,రైతుబీమా,24గంటల ఉచిత విద్యుత్, లక్ష రుణమాఫీ చేశారన్నారు.దేశంలో ఎక్కడా లేని పథకాలు తెలంగాణలో ఉన్నాయన్నారు కేటీఆర్..